Etela Rajender: నేను సీఎం కావాలనుకోలేదు | Etela Rajender Press Meet In Huzurabad | Sakshi
Sakshi News home page

Etela Rajender: నేను సీఎం కావాలనుకోలేదు

Published Wed, May 5 2021 2:19 AM | Last Updated on Wed, May 5 2021 11:27 AM

Etela Rajender Press Meet In Huzurabad - Sakshi

సాక్షి , కరీంనగర్‌/ హుజురాబాద్‌: ‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం టీఆర్‌ఎస్‌. సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏనాడూ పనిచేయలేదు. కేసీఆర్‌ తెలంగాణ గాంధీగా పేరు సంపాదించు కున్నారు. అలాంటి వ్యక్తి ఎవరివో తప్పుడు మాటలు విని నాపై కక్ష సాధిస్తున్నారు. నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకోలేదు. కేసీఆర్‌ తర్వాత ఆయన కుమారుడే సీఎం అవుతారని చెప్పాను. మంత్రి కేటీఆర్‌ సీఎం అభ్యర్థిత్వాన్ని స్వాగతించాను. బయట ఎవరో నేను సీఎం అవుతారని అనడం నా తప్పా?’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు.

ఇంతటి కుట్ర ఎక్కడా చూడలేదు
‘ఎవరివో తప్పుడు సలహాలు, నివేదికల వల్ల సీఎం కేసీఆర్‌ నాపై కక్ష సాధిస్తున్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇలా ఎవరూ వ్యవహరించలేదు. నా వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. నన్ను విమర్శిస్తున్న వారంతా నా సహచరులే. టీఆర్‌ఎస్‌లో మంత్రులకు గౌరవం దక్కడం లేదు. ఈరోజు నాపై మంత్రులు (కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌) చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. నాతో ఎవరేం మాట్లాడారో తెలుసు. సీఎం అహంకారంపై మంత్రులే మాట్లాడారు. సీఎంకు ఇంత అహంకారం ఉంటదా అని మంత్రి గంగుల కమలాకర్‌ నాతోనే వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లో అంతా స్క్రిప్ట్‌ ప్రకారమే మాట్లాడతారు. రాసిచ్చింది చదవడం తప్ప సొంతంగా మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదు. 20 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చాలా చూశాను. అందరి లిస్ట్‌ నా దగ్గర ఉంది. మంత్రులుగా కాకుండా.. మనుషులుగా మాట్లాడాలి. కనీసం ఆ మంత్రులకు అయినా ఇక నుంచి కేసీఆర్‌ గౌరవం ఇవ్వాలని కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్‌ త్యాగం లేదని, కమిట్‌మెంట్‌ లేదని మాట్లాడుతున్న వాళ్ల విజ్ఞతకే వదిలేసున్నా. నేను మేకవన్నెపులిని అంటున్న వాళ్ల చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నా’అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. 

కరీంనగర్‌లో పార్టీని నిలబెట్టా
‘కేసీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు గులాబీ జెండాను ప్రజలు నిలబెట్టారు. 2003లో పల్లె బాట ముగింపు సభ కార్యకమాన్ని నిర్వహిస్తే కేసీఆర్‌ నన్ను మెచ్చుకున్నారు. 2004లో కమలాపూర్‌ నియోజకవర్గానికి 23 మంది అభ్యర్థులు పోటీకి సిద్ధమైతే, నా ప్రతిభను గుర్తించి టికెట్‌ ఇచ్చారు. కరీంనగర్‌ ఉద్యమాన్ని కాపాడింది హుజూరాబాద్, కమలాపూర్‌ నియోజకవర్గ ప్రజలు మాత్రమే. కరీంనగర్‌ ఎంపీగా కేసీఆర్‌ రాజీనామా చేస్తే హుజూరాబాద్, కమలాపూర్‌ ప్రజలే ఆయన గెలుపునకు కృషి చేశారు’అన్నారు. 

వేరే పార్టీల నేతలను కలవకూడదా?
‘నేనే అన్ని పార్టీల నేతలతో బాగుంటాను. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీల నాయకులు కలవడం సహజమే. కానీ ఇక్కడ అలా లేదు. వేరే పార్టీ వారిని కలిస్తే పార్టీ మారుతున్నారా అని హింసించడం జరుగుతుంది. కాంగ్రెస్‌తో మాట్లాడితే నేరం.. బీజేపీతో మాట్లాడితే తప్పు అనడం టీఆర్‌ఎస్‌లోనే ఉంది. గతంలో సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని జమ్మికుంటకు నీళ్లు కావాలని కలవడానికి వెళ్లాను. ఇవ్వాళ అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మంత్రులను కలవడానికి వస్తే ఫిక్స్‌ అయినట్టేనా?’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement