సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ పార్టీకి ఓనర్లమని నినదించి తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రకంపనలు పుట్టించిన నాటి నుంచి జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్ తనదైన పంథాను వీడడం లేదు. పార్టీ అగ్ర నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడిస్తున్న ఆయన పార్టీలో చర్చనీయాంశంగా మారారు. తాజాగా వీణవంకలో మాట్లాడుతూ ‘కల్యాణలక్ష్మి, పెన్షన్లు, రేషన్‌కార్డులు పేదరిక నిర్మూలనకు పరిష్కారం కాదు’ అని ప్రభుత్వ పథకాలపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించి పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా మారారు.
ఈ నేపథ్యంలో సోమవారం శాసనసభ కార్యక్రమాలు ముగిసిన తరువాత రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంత్రి ఈటలను తన కారులో తీసుకెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేటీఆర్, ఈటల పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. వీరు ఏయే అంశాలపై వీరు చర్చించారనేది తెలియకపోయినా ఈటల వ్యాఖ్యలను అధిష్టానం కొంచెం సీరియస్‌గానే తీసుకున్నట్లు అర్థమవుతోంది.
రైతు నేతగా మరోసారి కీలక వ్యాఖ్యలు
‘నేను మంత్రిగా ఉండొచ్చు.. లేకపోవచ్చు.. రైతు ఉద్యమం ఎక్కడ ఉన్నా నా మద్దతు ఉంటుంది. రైతుబంధు పథకం మంచిదే కానీ... ఇన్‌కంటాక్స్ కట్టే వాళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, వ్యవసాయం చెయ్యని గుట్టలకు, లీజుకిచ్చే భూములకు రైతుబంధు ఇవ్వొద్దు అని వీణవంక మండలం రైతులు కోరుతున్నారు. ఢిల్లీలో రైతులు చేసే ఉద్యమానికి మద్దతుగా నిలుస్తా’ అని గత జనవరి ఆఖరులో, ఫిబ్రవరి మొదటి వారంలో హుజూరాబాద్‌లో రైతువేదికల ప్రారంభోత్సవాల సందర్భంగా పార్టీ విధానాలకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకంలోని లోపాలను వీణవంక సభలో రైతుల మాటలుగా వ్యాఖ్యానించడం, రైతు చట్టాలపై వ్యతిరేక ఆందోళనలను పార్టీ వ్యూహాత్మకంగా పక్కన బెట్టగా, అదే సమయంలో ఈటల ఆ చట్టాలలోని లోపాలు, రైతుల ఆందోళనలను పాలకుల తీరును తూర్పారపట్టారు. అదే సమయంలో ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా తగిన సమయం కేటాయించలేక పోతున్నందున త్వరలోనే కేటీఆర్ సీఎం కావచ్చు’ అని వ్యాఖ్యానించి కొత్త చర్చకు దారితీశారు.
దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ‘ముఖ్యమంత్రిగా కేటీఆర్ సమర్థుడు’ అనే పల్లవి ఎత్తుకోవడం, స్వయంగా కేసీఆర్ ఆ వివాదానికి తెరదించడం జరిగిపోయాయి. కేసీఆర్‌తో సమావేశం తరువాత కొంతకాలం ‘కామ్’గా ఉన్న ఈటల మరోసారి వీణవంకలో చేసిన వ్యాఖ్యానాలు కొత్త చర్చకు దారితీశాయి.
పార్టీ, జెండా కాదు మనిషిని గుర్తు పెట్టుకోమన్న ఈటల
‘పరిగె ఏరుకుంటే రాదు... పంట పండితే వస్తది’ అనే సామెతను ఊటంకిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, రేషన్‌కార్డులను పరిగెలతో పోల్చడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చని, నేను ఇబ్బంది పడ్డా, గాయపడినా మనసును మార్చుకోనని బరువైన వ్యాఖ్యలు చేయడంలో గల కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు.
ఒకవైపు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన హుషారులో పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటుంటే, ఈటల తనలోని అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడం వెనుక గల మతలబు ఏంటని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా కేటీఆర్‌తో ప్రగతిభవన్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసిన ఈటల ‘గాయపడ్డ’ మనసును మార్చుకుంటాడో లేదో వేచి చూడాలి.
అసంతృప్తి సెగలు 2018 నుంచే
2018లో రెండోసారి తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచే మంత్రి ఈటల రాజేందర్‌లో అసంతృప్తి సెగలు మొదలయినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రివర్గ కూర్పులో ఈటల పేరును తొలుత చేర్చలేదని, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన అప్పటి ఎంపీ సూచనల మేరకు చివరి నిమిషంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆరుసార్లు గెలిచి, బీసీ నేతగా గుర్తింపు పొందిన తనకు అవమానం జరిగిందని ఈటల ‘గాయపడ్డట్టు’ ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిన తీరుతో అర్థమైంది.
ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ ఓడిపోవడం, జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి దక్కడం తదితర కారణాలతో ఆయనకు, పార్టీ అధిష్టానానికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment