సాక్షి, నల్గొండ: లోక్‌సభ ఎన్నికల సర్వేలను తలదన్నేలా ఫలితాలు రాబోతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆరు నెలల కాలంలోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఒకే ఒక సీఎం రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ పెద్ద సిపాయి అనుకున్నా కానీ అంత ఉత్తదేనని అన్నారు. ప్రజలను దోచుకునే వాళ్లందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం దేవరకొండలో బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం ఒక్క స్కాం కూడా చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్‌లేనని.. మంత్రులు జైలుకు కూడా పోయారని పేర్కొన్నారు.
అబద్ధాల నిర్మాణం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మండిపడ్డారు జేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అవినీతికి,అన్యానికి, ధర్మానికి, ఆ ధర్మానికి జరుగుతున్న పోటీనే ఈ ఎన్నికలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య కుమ్ములాటలు తప్ప అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment