
స్వయంగా మంత్రి హరీష్‌రావు సర్పంచ్‌ల మీద ఎంపీటీసీల మీద చిందులేశాడని ఫైర్ అయ్యారు.
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ప్రజలు తన వెంటే ఉన్నారని, ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, రాజీనామా చేసి ఐదు నెలలు అయిందని అన్నారు. ఐదు నెలల నుంచి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ నుంచి అరడజను మంది మంత్రులు హుజురాబాద్ మీద పడ్డారని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేసేలా వ్యవహరించారని, హుజురాబాద్ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేసి అనేక ప్రలోభాలకు గురి చేశారని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన తొనకకుండా జంకకుండా అండగా హుజురాబాద్ ప్రజానీకం నిలిచిందన్నారు.
చదవండి: హుజురాబాద్, బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
స్వయంగా మంత్రి హరీష్‌రావు సర్పంచ్‌ల మీద ఎంపీటీసీల మీద చిందులేశాడని ఫైర్ అయ్యారు. తాను దమ్మనపేటలోని సమ్మిరెడ్డి ఇంటికి వెళితే 10 రోజుకు అతన్ని ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. హుజురాబాద్‌లో సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల మీద నమ్మకము లేదని, సిద్దిపేట, ఇతర ప్రాంతాలను నుంచి జనాల్సి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే, పెన్షన్ రావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.
దళితబంధు రావాలంటే టీఆర్‌ఎస్ జెండా కట్టాలని, ఆశ వర్కర్, ఏఎన్ఎమ్‌ల కుటుంబ సభ్యులు వేరే పార్టీలతో తిరగవద్దని హుకుం జారీ చేశారని మండిపడ్డారు. తనలో ఓ కండక్టర్ కరచాలము చేస్తే అతన్ని తీసుకుపోయి సిరిసిల్లకు పంపారని తెలిపారు. ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా పోరాడాలని అన్నారు. తాను చేసిన 18 సంవత్సరాల సేవ ఇప్పుడు కనబడుతుందని తెలిపారు. బెదిరింపులు, కుట్రలతో హుజురాబాద్ ప్రజలను ఏమి చేయలేరని ఈటల అన్నారు.