సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ రాజకీయ వేడి కరీంనగర్‌ను తాకింది. రెండోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. 2018 నుంచి ఉప్పు నిప్పులా ఉంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్ మీడియా ముందే పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకున్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన తరువాత నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆగ్రహంతో ఉన్న ఈటల మంగళవారం హుజూరాబాద్‌లో మంత్రి గంగులపై ఫైరయ్యారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు ఈటలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీతోనే ఉంటామని చెపుతూ గంగులను కలుస్తుండడంతో ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంది.
మండలాల వారీగా పార్టీ ఇన్‌చార్జీలను నియమించి నాయకులను తనకు కాకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో గంగుల పేరు ప్రస్తావించకుండా ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటల చేసిన వ్యాఖ్యలతో అలర్ట్ అయిన మంత్రి గంగుల కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు. తనపై మాజీ మంత్రి ఈటల చేసిన విమర్శలను తోసిపుచ్చుతూనే పలు ఆరోపణలు చేశారు. ఈటల పేరును ప్రస్తావిస్తూ మంత్రి ఘాటైన విమర్శలు చేయడంతోపాటు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.
వ్యక్తిగత విమర్శల స్థాయికి రాజకీయం
‘నువ్వొకటంటే నేను రెండంటా..’ అనే ధోరణిలో మంగళవారం ఈటల, గంగుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. హుజూరాబాద్‌లో నాయకులు, కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతున్నారని, మంత్రి, ఇన్‌చార్జీలు ‘గొర్రెల మంద మీద తోడెళ్లలా’ దాడి చేస్తున్నారని ఈటల మరోసారి ధ్వజమెత్తారు. దీనికి స్పందించిన మంత్రి ‘ఏడేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు విచారించలేదు. 1992 నుంచే మాకు గ్రానైట్ వ్యాపారం ఉంది. చట్టబద్ధంగా పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేసుకుంటే తప్పా? అని కౌంటర్ ఇస్తూనే.. హుజూరాబాద్, పాత కమలాపూర్ నియోజకవర్గాల్లో 30 గ్రానైట్ క్వారీలు ఉన్నాయని, వాటి నుంచి ఎన్ని మామూళ్లు వసూలు చేసుకొని నడిపిస్తున్నావని’ ప్రతి విమర్శలు చేశారు.
2018 ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నినట్లు చెపుతూనే.. సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోలు చేసిన ఓట్లతో టీఆర్‌ఎస్ గెలిచినట్లు ఈటల చేసిన వ్యాఖ్యలను కూడా గట్టిగానే తిప్పికొట్టారు. కేసీఆర్ మీద అభిమానంతో ఓటేసిన తెలంగాణ ప్రజలను అమ్ముడుపోయే వారిగా చిత్రీకరిస్తారా? అని కొత్త అర్థాలు తీసుకొచ్చారు. హుజూరాబాద్ ప్రజలు తన వెంటే ఉంటారని మాజీ మంత్రి చెప్పగా, అక్కడ పార్టీ స్ట్రాంగ్‌గా ఉందని, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసరడం గమనార్హం.
చదవండి: ఆత్మగౌరవం పేరిట కొత్త నాటకం: మంత్రి గంగుల
ఇన్‌చార్జీల నియామకంతో ఆగ్రహం
ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి తొలగించారే తప్ప ఆయన టీఆర్‌ఎస్ పార్టీకి గానీ, ఎమ్మెల్యే పదవికి గానీ రాజీనామా చేయలేదు. ఇప్పటికీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. కరోనా తగ్గిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఇప్పటికే చెప్పారు. అయితే.. ఈటల ‘మాజీ మంత్రి’ అయిన నాటి నుంచే జిల్లా మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్‌పై ఫోకస్ పెంచారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలను, ఇతర నాయకులను కరీంనగర్‌కు పిలిపించి వారికి తానున్నాననే ధైర్యం ఇస్తూ ఈటల గూటి నుంచి వేరు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
తాజాగా కరీంనగర్‌కు చెందిన పలువురు నాయకులకు హుజూరాబాద్ నియోజకవర్గంలో మండల ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. హుజూరాబాద్‌కు నగర మేయర్ వై.సునీల్‌రావు, జమ్మికుంట, ఇల్లందకుంటలకు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, వీణవంకకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కమలాపూర్‌కు కిమ్స్ రవీందర్ రావును నియమించారు. ఈ పరిణామాలతో మాజీ మంత్రి నేరుగా హుజూరాబాద్‌కు మకాం మార్చే పరిస్థితి ఎదురైంది. ఇప్పట్లో రాజీనామా చేసే ఆలోచనలో మాజీ మంత్రి లేరనే విషయం తెలిసి.. ఆయనను రెచ్చగొట్టే విధంగా మంత్రి కమలాకర్ నేతృత్వంలోని ఓ వర్గం పనిచేస్తుండడం గమనార్హం.
‘హుజూరాబాద్‌లో నాయకులు, కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతున్నారు. మంత్రి, ఇన్‌చార్జీలు గొర్రెల మంద మీద తోడెళ్లలా దాడి చేస్తున్నారు. కరీంనగర్‌ను బొందలగడ్డలా మార్చినవ్.. కొండలను, గుట్టలను నాశనం చేసినవ్. రూ.వందల కోట్ల పన్నులు ప్రభుత్వానికి ఎగ్గొట్టినవ్’
– మంత్రి గంగులపై మాజీ మంత్రి ఈటల ఫైర్
హరీశ్‌కు బాధ్యతలు అప్పగిస్తారా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైతే పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న మంత్రి హరీష్‌రావుకు గెలుపు బాధ్యతలు అప్పగించే ఆలోచనతో పార్టీ ఉన్నట్లు ఈటల మాటలను బట్టి అర్థమవుతోంది. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన ‘నా సహచరుడైన మంత్రిని హుజూరాబాద్ ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు తెలిసింది. హుజూరాబాద్ రా. ఎక్కడికి వెళ్లినా పార్టీని గెలిపిస్తడు అనే పేరుంది కదా. ఇది హుజూరాబాద్, ఇక్కడ ప్రజలను ఎవరూ అంచనా వేయలేరు. 20 ఏళ్లుగా నాతో ఉన్నారు. కరీంనగర్‌లో ఎంపీగా ఓడినా హుజూరాబాద్‌లో మెజారిటీ ఇచ్చిన్రు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమ కాలం నుంచి ఈటలకు సన్నిహితుడిగా పేరున్న హరీశ్ వ్యూహాలతోనే చెక్ పెట్టించాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లా మంత్రి గంగుల గ్రౌండ్‌వర్క్ ప్రిపేర్ చేసే బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.
‘ఏడేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు విచారించలేదు. 1992 నుంచే మాకు గ్రానైట్ వ్యాపారం ఉంది. చట్టబద్ధంగా పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేసుకుంటే తప్పా? హుజూరాబాద్, పాత కమలాపూర్ నియోజకవర్గాల్లో 30 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వాటి నుంచి ఎన్ని మామూళ్లు వసూలు చేసుకొని నడిపిస్తున్నావ్.’
– మాజీ మంత్రి ఈటలకు మంత్రి గంగుల కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment