సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
కుషాయిగూడ(హైదరాబాద్): తెలంగాణ ఉద్యమనేత, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివా రం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు కీలక నేతలు ముఖ్యమంత్రిని కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రామ్మోహన్‌కు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చాలాకాలం వరకు ఎలాంటి పదవులు దక్కలేదు.
బొంతు అసంతృప్తిని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో నిలిపి తెలంగాణ ఏర్పడిన అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మొదటి మేయర్‌గా అవకాశం కల్పించారు. అనంతరం తన సతీమణి బొంతు శ్రీదేవిని చర్లపల్లి కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. మేయర్‌గా కొనసాగుతూ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానంపై బొంతు కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలు కూడా ఉప్పల్ స్థానం కోసం పోటీపడగా కేసీఆర్ బండారికే టికెట్ ఖారారు చేశారు.
పార్టీ టికెట్ ఇవ్వలేదని మనస్తాపం చెంది కొన్ని రోజులపాటు మౌనంగా ఉన్న రామ్మోహన్‌తో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడి సర్దిచెప్పారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లో ఏదైనా ఒకచోట పోటీ చేసే అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ పెద్దలను బొంతు కోరినప్పటికి టికెట్ దక్కే చాన్స్ కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. సోమవారం తన మనసులో మాటను మీడియాకు వెల్లడించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment