సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు అవుట్‌డేటెడ్ పొలిటీషియన్ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా? అని ప్రశ్నించారు. అలాగే, గతంలో ప్రశాంత్ కిషోర్‌ను దారుణంగా తిట్టిన విషయాలు ఎల్లో బ్యాచ్ మరిచిపోయిందా? అని విమర్శలు చేశారు.
కాగా, కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఎంత మంది పీకేలను తెచ్చి పెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఐప్యాక్‌తో ప్రశాంత్ కిషోర్‌కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ మేము ఇప్పటికే పూర్తిగా వాడేశాం. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మేము పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడు అని చంద్రబాబు ఆరోపించారు. మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్ చేస్తున్నదేంటి?. ఆనాడు మనకంటే గొప్పోళ్లు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా తమ్ముళ్లూ అన్నాడు కదా. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు.. ప్రశాంత్ కిషోర్ గురించి ఏం అన్నారో అందరికీ తెలుసు.
చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే చంద్రబాబును పీకే కలిశారు. చంద్రబాబు అవుట్‌డేటెడ్ పొలిటీషియన్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చేసేదేమీ లేదు. బాబాయ్‌ను చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటాడా?. ఏం చేస్తారో వాళ్లకే తెలియాలి.
పీకేకు ఐప్యాక్‌తో సంబంధమే లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయిపోయాక వ్యూహకర్తగా తప్పుకుని ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబు ఒకవైపు పవన్ కల్యాణ్‌ను పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. మరోవైపు ఇంకో పీకేను పెట్టి కాంగ్రెస్‌తో చర్చలకు తెరలేపాడు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం. కేంద్రంలో బీజేపీ వస్తుందా? లేక కాంగ్రెస్ వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు’ అంటూ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment