చంద్రబాబూ ఎందుకీ ‘కొనుగోలు’ డ్రామాలు: పేర్ని నాని | Ex Minister Perni Nani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ ఎందుకీ ‘కొనుగోలు’ డ్రామాలు: పేర్ని నాని

Published Thu, Aug 29 2024 6:58 PM | Last Updated on Fri, Aug 30 2024 1:37 AM

Ex Minister Perni Nani Fires On Chandrababu

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాడభూతి.. నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు.. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు అని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కుచెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.

ఆ భయం చంద్రబాబును వెంటాడుతోంది..
వైఎస్‌ జగన్‌ తనకు రాజకీయంగా అడ్డు పడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే 2011 నుంచి ఆయనను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు. ఆ ప్రక్రియలోనే జగన్‌గారిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని, అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిల్చి, తొలుత 67 సీట్లు గెల్చి సత్తా చూపారని గుర్తు చేశారు. అప్పుడు కూడా తమ పార్టీని, జగన్‌ని నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు. 

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా..
టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేశాకే ఆ పని చేయాలని చెబుతున్న చంద్రబాబు, అప్పుడు ఆ 23 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా జగన్‌ని ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని తేల్చి చెప్పారు.

జగన్‌ గెలవాలంటే జనం సాయం చాలు
‘చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం. అదే జగన్‌ గెలవాలంటే జనం సాయం చాలు’.. అని మాజీ మంత్రి స్పష్టం చేశారు. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్‌ జిలానీ బ్యాచ్‌లు జగన్‌ని అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, 2029 ఎన్నికల్లో ప్రజలు వారికి కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌, వారికి పదవులు కట్టబెట్టారని పేర్ని నాని గుర్తు చేశారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్‌ చేశారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌
కేవలం జగన్ వల్లనే ఒక మత్స్యకారుడు పెద్లలసభలో అడుగుపెట్టగలిగాడని పేర్ని నాని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు (డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ) ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, శాంతి భద్రతల గురించి అస్సలు ఆలోచించకుండా, బాధ్యతను పూర్తిగా మర్చిన హోం మంత్రి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆక్షేపించారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
ఆనాడు తమ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారన్న పేర్ని నాని.. ఇప్పుడు లావాదేవీలే తప్ప రాజకీయాలు లేవని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చినా, నిత్యం మాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి, ఎల్లో మీడియా.. తాజాగా ఒక సినీ నటి కేసు టేకప్‌ చేశారని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అభియోగాలు ఎదుర్కొంటూ, కేసులు నమోదైన ఆమెను తెరపైకి తీసుకొచ్చి, ఇక్కడ అనేక మంది ఐపీఎస్‌ అధికారులను వేధించడమే లక్ష్యంగా ఎల్లో మీడియా డ్రామా చేస్తోందని వెల్లడించారు. 2014లో మా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఏనాడూ మా పార్టీ గుమ్మం తొక్కని కుక్కల విద్యాసాగర్‌ను, ఇప్పుడు మా పార్టీకి అంటగడుతున్నారని, ఇదంతా టార్గెటెడ్‌ ఐపీఎస్‌ అధికారులను వేధించడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్ర అని పేర్ని నాని తెలిపారు. ఆ నటి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement