విశాఖ సిటీ: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంపై పచ్చ మీడియా విషం కక్కుతోంది. వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తోంది. టీడీపీ నేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం ఇవ్వలేదన్న అక్కసుతో అసత్య కథనాన్ని ప్రచురించింది.
ఆ మైదానంలో ఆదివారం వరకు ఆర్గానిక్ మేళా జరిగిన విషయం, దాని కోసం వేసిన భారీ టెంట్లు, షెడ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. కళ్లున్న కబోదిలా విషపు రాతలు రాసింది. విఖ్యాత విద్యా సంస్థ ఆంధ్రా యూనివర్శిటీకి రాజకీయాలను ముడిపెడుతూ అవాస్తవాలు రాసిన పచ్చపత్రికపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్గానిక్ మేళా కారణంగా..
లోకేశ్ పాదయాత్ర ముగింపు సభను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించడానికి అనుమతి కోరారు. అయితే ఆ మైదానంలో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు సేంద్రీయ రైతులు, ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆర్గానిక్ మేళా నిర్వహించారు. దీని కోసం ఏయూ నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు. ఈ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం రాత్రి మేళా ముగిసింది.
ఇప్పటికీ మైదానంలో వేసిన టెంట్లు, షెడ్లు, ఇతర సామగ్రి తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో బుధవారం భారీ బహిరంగ సభ కోసం మైదానం కేటాయించాలని టీడీపీ నాయకులు కోరారు. ఆర్గానిక్ మేళా టెంట్లు, సామగ్రి తొలగించడానికి మరికొంత సమయం పడుతుంది. టీడీపీ సభకు వేదిక, ఇతర ఏర్పాట్లకు కనీసం నాలుగు రోజుల ముందే మైదానాన్ని అప్పగించాలి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సభకు మైదానం కేటాయించడం సాధ్యం కాదని ఏయూ అధికారులు టీడీపీ నాయకులకు సమాధానమిచ్చారు.
ఆ విషయాన్ని వారు కూడా అంగీకరించారు. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ, పచ్చ పత్రిక మాత్రం లోకేశ్ సభకు మైదానం కేటాయించలేదన్న అక్కసుతో తప్పుడు రాతలు రాసింది. అసలు విషయాన్ని వక్రీకరిస్తూ ఉద్దేశపూర్వకంగానే మైదానం ఇవ్వలేదని ఏయూపైన, వైస్ చాన్సలర్పైనా అవాస్తవాలను ప్రచురించింది. ఏయూ వీసీ, ప్రొఫెసర్లు వైసీపీ ప్రతినిధులు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.
ఏయూ సొమ్ము వాడుకున్నది చంద్రబాబే..
వాస్తవానికి ఆంధ్రా యూనివర్శిటీ సొమ్మును సొంత ప్రచారానికి వాడుకున్న ఘనుడు చంద్రబాబే. 2018లో జ్ఞానభేరి పేరుతో చంద్రబాబు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ నిర్వహించారు. ఈ సమయంలో సొంత డబ్బా కొట్టుకోడానికి ఆంధ్రా యూనివర్శిటీ నిధులు రూ.6 కోట్లు వాడుకున్నారు. ఆయన సొంత ప్రచారం కోసం ఏయూ సొమ్ముని, మైదానాలను వాడుకున్న విషయాన్ని పచ్చ పత్రిక ప్రశ్నించదు. కానీ, అనివార్య కారణాల వల్ల మైదానం కేటాయించలేదన్న అక్కసుతో పిచ్చి రాతలు రాయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment