
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ మండిపడ్డారు.లక్షలాది మంది రైతుల మనోభావాలను వినేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆమె ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రపతి భవన్‌కు మార్చ్ గా బయల్దేరారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
(చదవండి : కోట్లాది జీవితాలు రోడ్డున పడ్డాయి: రాహుల్)
దీనిపై ప్రియాంక స్పందిస్తూ...మనం ప్రజాస్వామ్య వాతావరణంలో బతుకుతున్నామని, ఎంపీలందరూ ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికయ్యారని అన్నారు. రాష్ట్రపతిని కలిసే హక్కు ఎంపీలకు ఉంటుందని, అందులో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రైతుల వాదనను, సమస్యలను వినడానికి ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదని ప్రియాంక విమర్శించారు. ‘రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరుదామంటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రభుత్వంపై ఎవరు అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం చేసినా... వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తారు. బీజేపీ నేతలు రైతులతో ఎలా వ్యవహరిస్తుందన్న దానికి ఇదే నిదర్శనం. రైతులను దేశ ద్రోహులని ప్రభుత్వం భావిస్తే పాపం చేసినట్లే. రైతులకు మద్దతుగానే ఈ మార్చ్‌ను నిర్వహిస్తున్నాం’ అని ప్రియాంక గాంధీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment