
కోల్‌కతా: నోటి దురుసుతో తరచూ వార్తల్లో నిలిచే టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారు. భారత సంస్కృతిలో ఒక భార్యను ఐదుగురు పురుషులు పంచుకోవచ్చని వ్యాఖ్యానించారు. మహాభారతంలో ద్రౌపదిని పరోక్షంగా ప్రస్తావించారు.
పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కేంద్ర విద్యా శాఖ బృందం సమీక్ష నిర్వహించింది. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఐదుగురు వంట సిబ్బందికి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏడుగురికి సమానంగా ఇస్తోందని కనిపెట్టారు.
దీనిపై వ్యంగ్యంగా స్పందించిన మదన్ మిత్రా.. భారత సంస్కృతిలో ఐదుగురు కలిసి ఒకే భార్యను పంచుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తుందో తెలిపేందుకు మదన్ వ్యాఖ్యలే నిదర్శనం అని కమలం పార్టీ ఎమ్మెల్యే, నటి అగ్నిమిత్ర పాల్ ధ్వజమెత్తారు. టీఎంసీ నాయకులు అందుకే అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు.
సొంత టీఎంసీ పార్టీ కూడా మదన్ మిత్రా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సూచించారు. మిత్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత ఇతిహాసాల గురించి తప్పుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదన్నారు.
చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
Comments
Please login to add a commentAdd a comment