సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీఎన్నికల హడావుడి ముగిసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల్లోనూ మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా విపక్షాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, గెలిచిన పలువురు నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ మాజీ మంత్రి ఎంపీగా పోటీ చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం.
మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంపై అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతల కన్ను పడింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం అయిన మల్కాజ్‌గిరిలో 31 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు గుర్తు మీద పోటీచేసి మరోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మేడ్చల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఎంపీ సీటుపై ఆయన కన్ను పడింది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు పోటీ చేసి గెలిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ సీటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఓటమి చెందారు. అందుకే ఈసారి తానే పోటీ చేసి గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ మల్లారెడ్డి ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే.. ఆ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ సీటుకు తన కోడలు ప్రీతి రెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలకు, ఆ తర్వత జరిగే అసెంబ్లీ ఉపఎన్నికకు ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..మల్లారెడ్డికి ఎంపీ సీటు ఇస్తే.. మేడ్చల్‌కు ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇతర నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని స్థానిక నేతలు పార్టీని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్‌గిరి ఎంపీ స్థానాలు రెండూ కీలకమే కావడంతో.. ఈ సారి కచ్చితంగా మల్కాజ్‌గిరి పై గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మల్లారెడ్డికి పట్టున్న స్థానం కావడంతో ఈ విషయంలో సీరియస్‌గానే ఆలోచన చేస్తోంది.
ఏదేమైనా మల్కాజ్ గిరి విషయంలో మాజీ మంత్రి మల్లన్న కూడా గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇక్కడ ఎలాగూ ప్రతిపక్షమే గనుక మళ్ళీ పార్లమెంట్ లో అడుగుపెట్టి... ఇక్కడున్న వివాదాల నుంచి బయట పడవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment