ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిపై కూడా... జీడిమెట్ల డివిజన్ సుచిత్రప్రాంతంలోని స్థలం తమదేనంటూవేరొకరితో వాగ్వాదం
స్థలం ప్రహరీ కూ ల్చివేత.. అడ్డుకున్న పోలీసులపైనా చిందులు
అదుపులోకి తీసుకొని పేట్ బషీర్‌బాద్ పీఎస్‌కు తరలింపు.. ఆపై కేసు నమోదు
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కక్ష సాధిస్తోందని రాజశేఖర్‌రెడ్డి ఆరోపణ
సుభాష్‌నగర్/ సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లు డు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై శనివారం పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర ప్రాంతంలో సర్వే నంబర్ 82, 83లో తనతో పాటు 8 మందికి ప్లాట్లు ఉన్నాయంటూ కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తాత్కాలికంగా ప్రహరీని ఏర్పాటు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి.. అనుచరులతో అక్కడికి చేరుకుని ప్రహరీని కూల్చివేశారు. ఆ భూమి తమదని, అక్కడ ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు.. విచారణ అయ్యేంత వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టవద్దని సూచించడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు.
మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.
మా భూమిని ఆక్రమించారు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న భూమిలోకి శుక్రవారం రాత్రి 300 మంది అక్రమంగా చొరపడి హద్దులను చెరపి, ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మరో బిహార్‌గా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment