మేడ్చల్: రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యే కావాలని కొంతమంది నాయకులు, స్థానాన్ని తిరిగి నెలబెట్టుకోవాలని మరి కొంతమంది నాయకులు రాజకీయాలు మొదలు పెట్టారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలతో కలిసి ఉన్న మేడ్చల్ ప్రజలు ప్రతీ ఎన్నికలో విలక్షణ తీర్పు ఇస్తున్నారు. నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న మేడ్చల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అభ్యర్థులకు అంగబలం, అర్థబలం ఉండి తీరాల్సిందే..
అన్ని పార్టీల్లో అంతర్గత పోరే..
ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో టికెట్లు ఆశించే నాయకులు ఒకరి కంటే ఎక్కువగా ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి మేడ్చల్‌కు మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడు పార్టీల నుంచి ఎనిమిది మంది బలమైన నాయకులు ఈ ఎన్నికల్లో ప్రధాన మూడు పార్టీల్లో టికెట్ కోసం పోటీపడుతున్నారు. మూడు టికెట్ల కోసం 8మంది పోటీలో ఉన్నారు. సీజన్ ప్రారంభం నాటికి మరి కొంతమంది వలస నాయకులు, జంప్ జలానీలు జాబితాలో చేరతారు.
బీఆర్‌ఎస్‌లో ముగ్గురు..
తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో ఎమ్మెల్యేగా సుదీర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో మల్లారెడ్డి తన టికెట్ బలవంతంగా చివరి నిమిషంలో లాక్కున్నారని, ఈసారి టికెట్ తనదేనని ఆయన పలు సమావేశాల్లో చెబుతున్నారు. టికెట్ ఈసారి తనదేనని సీఎం కేసీఆర్ తనకు ఇప్పటికే ఖరారు చేశారని మంత్రి మల్లారెడ్డి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య టికెట్ పోరు జోరుగా సాగుతోంది. సుదీర్‌రెడ్డి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆయన కుమారుడు శరత్‌చంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఉండి తమ గ్రూపు రాజకీయం జోరుగా సాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి పార్టీలో 80శాతం నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని తన స్టైల్ రాజకీయం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కీలకంగా ఉండి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెబల్‌గా పోటీ చేసి ఓటమి పాలైన నక్క ప్రభాకర్‌గౌడ్ బీఆర్‌ఎస్ మేడ్చల్ టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి శిష్యుడిగా పేరుపొందిన ఆయన ఈసారి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో జోరుగా..
కాంగ్రెస్ పారీ్టలో ప్రతి ఎన్నికల్లో గ్రూపు రాజకీయం కనబడటం సాధారణం. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోయాక నియోజకవర్గ రాజకీయానికి కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అయ్యా క ధిక్కార స్వరం వినిపించి కాంగ్రెస్‌లో కనుమరుగయ్యారు. ఎన్నికల సీజన్ కావడంతో తిరిగి రేస్‌లోకి వచ్చాడు. నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు హరివర్ధన్‌రెడ్డి, వజ్రేయాదవ్‌లు ఈ సారి ఎన్నికల్లో టికెట్ సాధించేందుకు ఇద్దరు నేతలు ఎంపీ రేవంత్‌రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఇద్దరు నేతలు నియోజకర్గంలో ఎవరికి వారుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరివర్ధన్‌రెడ్డి జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా ఉండి జోరుగా కార్యక్రమాలు చేస్తున్నారు.
బీజేపీలో ఎవరో..?
బీజేపీలో మేడ్చల్ అభ్యరి్థగా నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన కొంపల్లి మోహన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డిలు ఈ సారి పార్టీ బీఫారం ఆశిస్తున్నారు.
ఆ పార్టీ అధినాయకత్వం వలస నాయకులను నమ్ముకోవడంతో ఎన్నికల సమయానికి ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి వచ్చి చేరుతాడో.. టికెట్ ఎవరికి వస్తుందో ఎన్నికల వరకు సస్పెన్స్‌గానే ఉంటుంది. మిగతా పారీ్టలైన బీఎస్పీ, వామపక్షాలు పార్టీ అభ్యర్థుల వేటలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment