స్థిరత్వం లేని కొందరు రాజకీయ నేతలు గాలివాటుకు ప్రయాణం చేస్తుంటారు. ప్రతి ఎన్నికలకు ఒక్కో పార్టీ చొప్పున మారుతుంటారు. అలాగే నియోజకవర్గాలూ మారుతుంటారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజలను మోసం చేసి అక్కడి నుంచి మరోచోటుకు వెళుతుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అలాంటి నాయకుడొకరు తయారయ్యారు. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా ఆ నాయకుడిలో మార్పు రాలేదు.
ఆయనో మాజీ ఎమ్మెల్యే. పద్నాలుగేళ్ల రాజకీయ జీవితం. రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదు పార్టీలు మారారు. చాలా నియోజకవర్గాలూ మారారు. పార్టీ మారడం అనేది పెద్ద సమస్య కాదు. కాని స్థిరత్వం ఉండదని, గాలివాటుకు పోతుంటారని, ఏ పార్టీలో ఉన్నా, అవినీతి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ముద్ర వేసుకున్నారు. ప్రజలు చీదరింపులు ఎదుర్కొంటున్నారు. ఆయనే పంచకర్ల రమేష్‌బాబు.
విశాఖలో షిప్పింగ్ కాంట్రాక్టులు చేసే రమేష్‌బాబు ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసి, చిరంజీవి పేరుతో పెందుర్తి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రజలకు సేవ చేస్తాడని నమ్మారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినపుడు ఆయన కూడా హస్తం గూటికి చేరారు.
2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పెందుర్తిలో చేసిందేమీలేక, అక్కడి ప్రజలకు మొఖం చూపించలేక యలమంచిలి టిక్కెట్ తీసుకుని సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. యలమంచిలి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నీరు, చెట్టు, చెరువు, మట్టి, కొండ అన్న తేడా లేకుండా అక్కడి ప్రకృతి సంపద అంతా దోచుకున్నారు.
చదవండి: పవన్ ‘బ్రో’ సీన్‌పై మంత్రి అంబటి రియాక్షన్
దోపీడి కోసమే రాజకీయాల్లోకి వచ్చిన పంచకర్ల రమేష్‌బాబును 2019 ఎన్నికల్లో జనం చిత్తుగా ఓడించారు. రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి తాను మారానంటూ వైఎస్సార్సీపీలో చేరారు. అధికార పార్టీని అడ్డుగా పెట్టుకుని దోపిడీ కొనసాగించవచ్చని భావించారు. ఫార్మా సిటీ, అరకులో భూముల కబ్జాకు సిద్ధమయ్యారు. రమేష్ బాగోతం తెలిసిన వైఎస్సార్‌సీపీ నాయకత్వం ఆయన్ను కట్టడి చేసింది.
దీంతో ఇక్కడ తన ఆటలు సాగవని అర్థమై.. పవన్ కళ్యాణ్ జనసేన పంచన చేరారు. అనేక పార్టీలు, పలు నియోజకవర్గాలు మారిన రమేష్‌బాబును చూసి జనం ఈసడించుకుంటున్నారు. రమేష్‌ను నమ్మి గతంలో ఆయన వెంట తిరిగిన కార్యకర్తలు చాలామంది ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారు. ఒకరిద్దరు మాత్రం భూకబ్జాలు, అక్రమ మట్టి తవ్వకాలతో ఆర్థికంగా బలపడ్డారు.
చదవండి: ‘వావీ వరసలు లేని.. నారాయణ.. నారాయణ’
ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు పంచకర్ల లాంటి నాయకులకు ఉత్తరాంధ్రలో చోటు ఇవ్వరాదని భావిస్తున్నారు. ఇటీవల పెందుర్తిలో ఆత్మీయ సమావేశం పేరిట పంచకర్ల కొందరు సన్నిహితుల్ని పిలవగా వారంతా ముఖం చాటేసారు. దోపిడీయే లక్ష్యంగా పార్టీలు, నియోజకవర్గాలు మారే రమేష్‌ను చూసి ఏ పార్టీ కార్యకర్తలు వస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. గ్లాస్ పార్టీ తరపున ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment