సాక్షి, హైదరాబాద్ : పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న మోదీ ప్రభుత్వం... హైదరాబాద్ అస్థిత్వ ప్రతీకలైన చార్మినార్, గోల్కొండలనూ ప్రైవేటుకు ధారాదత్తం చేయడానికి వెనుకాడదని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ నినాదాలు ఇస్తున్నారు. ఆచరణలో జరుగుతోంది మాత్రం... బేచో ఇండియా. అందుకే మేము సోచో ఇండియా (ప్రజలారా ఆలోచించండి)’ అని పిలుపునిస్తున్నామన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నేతలు గోబెల్స్‌కు కజిన్ సోదరుల్లా వ్యవహరిస్తూ అర్ధ సత్యాలు, అసత్యాలు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.
జవదేకర్‌కు ఇంగితం లేదా?
‘టీఆర్‌ఎస్–ఎంఐఎం సర్కారు వైఫల్యం’ అంటూ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల విడుదల చేసిన చార్జ్‌షీట్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ‘ఎవరో ఏదో కాగితం చేతిలో పెడితే ఫొటోలు దిగేందుకు జవదేకర్‌కు ఇంగితజ్ఞానం ఉండాలి. టీఆర్‌ఎస్ వైఫల్యాలు అని చెప్పే దమ్ములేక ‘టీఆర్‌ఎస్–ఎంఐఎం ప్రభుత్వం’ అని చెప్పడంలో మీ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ముస్లింల పట్ల బీజేపీకి ఉన్న ద్వేషం స్పష్టంగా బయటపడుతోంది’ అని అన్నారు.
వేర్పాటువాదులతో అంటకాగుతోంది బీజేపీయే
జమ్మూకశ్మీర్‌లో పీడీపీ, వేర్పాటువాద పార్టీలతో పొత్తుపెట్టుకున్నది బీజేపీయేనని కేటీఆర్ విమర్శించారు. వేర్పాటువాద శక్తులతో తమకున్న సంబంధాలను దాచిపెట్టి, టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం లేని సంబంధాలు అంటగడుతోందన్నారు. డిసెంబర్ 4న తమ పార్టీకి చెందిన మహిళా నేత హైదరాబాద్ మేయర్‌గా బాధ్యతలు చేపడుతారన్నారు. ఆరేళ్లలో తాము తెలంగాణ, హైదరాబాద్‌కు ఏం చేశామో చెప్తూ ప్రగతి నివేదిక విడుదల చేసి ఓట్లు అడుగుతున్నామన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ విడుదల చేసిన గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో పాత అంశాలు ఉన్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ ‘కటౌట్ కాదు.. కంటెంట్ చూడాలి’ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా ‘పొద్దుంది.. పొలముంది.. ప్రచారానికి ఇంకో నాలుగైదు రోజులు సమయం ఉన్నందున అన్ని అంశాలపై స్పందిస్తాం’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీకి 50 ప్రశ్నలు
ప్రభుత్వరంగ సంస్థలను దేశ భవిష్యత్తు కోసం అమ్ముతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘దేశ భవిష్యత్తు కోసం కాదు.. గుజరాత్‌లో ఉన్న కొంత మంది కోసమే అమ్ముతున్నారు’ అని ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ మూడు రోజుల క్రితం విడుదల చేసిన చార్జ్‌షీట్‌లో చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ... బీజేపీపైనా చార్జ్‌షీట్ ప్రకటించారు. ‘అసమర్థత, అన్యాయాలు, అసత్యాలు– భారతీయ జనతా పార్టీకి 50 ప్రశ్నలు’ అంటూ జాతీయ, తెలంగాణ, హైదరాబాద్‌కు సంబంధించిన పలు అంశాల్లో బీజేపీ వైఖరిని కేటీఆర్ ప్రశ్నించారు. 50 ప్రశ్నల్లో ముఖ్యమైనవి ఇవి!
ఇదీ చార్జ్‌షీట్
► ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన భారతీయ రైల్వే, 40 కోట్ల పాలసీదారులు కలిగిన ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారు.
► ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దగా చేయడంతో పాటు, నోట్ల రద్దు, లాక్‌డౌన్ పేరిట ఉపాధి, ఉద్యోగాలు లేకుండా చేశారు.
► అసమర్థ విధానాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు, జీడీపీని ఎన్నడూ లేని రీతిలో అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు.
► లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల నుంచి రైలు చార్జీల పేరిట డబ్బులు పిండుకున్నారు.
► రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అని 20 మందికి కూడా ప్రయోజనం చేకూర్చలేదు.
► జన్‌ధన్ ఖాతాల్లో ఒక్కోదాంట్లో రూ.15 లక్షలు, విదేశాల నుంచి నల్లధనం ఏమయ్యాయి.
► పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ పర్యవసానాలు, ఎంఎస్‌ఎంఈ రంగానికి నష్టం, బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం తదితరాలకు బీజేపీయే కారణం.
► రైతుల నడ్డి విరిచేలా నల్లచట్టాలు, కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరవడం, పెట్రోలు ధరల పెంపు.
► ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును లాక్కోవడం, విభజన హామీలు తుంగలో తొక్కడం.
► వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు, సన్నాలకు అదనపు ధర రాకపోవడం, జీఎస్టీ బకాయిల ఎగవేత బీజేపీ పుణ్యమే.
► హైదరాబాద్‌లో ఐటీఐఆర్ రద్దు, మూసీ అభివృద్ధికి మొండిచేయి, స్కైవేలకు అడ్డంకులకు సమాధానం చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment