
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం అల్వాల్ చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆరేళ్ల పాలనలో ఎన్నో సమస్యలను అధిగమించామని, అమెజాన్, యాపిల్, గూగుల్ కంపెనీలను హైదరాబద్‌కు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ, కాంగ్రెస్, ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: గ్రేటర్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకా
రూ.10వేల వరద సాయాన్ని ఆపింది కాంగ్రెస్, బీజేపీనేనని కేటీఆర్ మండిపడ్డారు. గత ఆరేళ్లలో రూ. 2 లక్షల72 వేల కోట్లు పన్ను రూపంలో కేంద్రానికి కట్టినట్లు వెల్లడించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.లక్షా 40 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. కరోనా, వరదల సమయంలో ప్రజలను ఆదుకుంది టీఆఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. బీజేపీ నేతలు నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దేశ ద్రోహులు, దేశ భక్తులకు జరుగుతున్న ఎన్నికలంటున్నారని అన్నారు. ఖచ్చితంగా లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని పేర్కొన్నారు. చదవండి: కాపీ కొట్టడానికి తెలివి ఉండాలి: కేటీఆర్