హోరెత్తుతున్న హైదరాబాద్‌ | GHMC Elections 2020 As A Platform For All Parties Future Fight | Sakshi
Sakshi News home page

హై పిచ్‌లో బ్యాలెట్‌ బీట్‌

Published Sat, Nov 28 2020 1:59 AM | Last Updated on Sat, Nov 28 2020 11:08 AM

GHMC Elections 2020 As A Platform For All Parties Future Fight - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంతో నగరం హోరెత్తిపోతోంది. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బల్దియా ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు సర్వశక్తులూ కేంద్రీకరించి గ్రేటర్‌ బరిలో శ్రమిస్తున్నాయి. గతానికి భిన్నంగా గ్రేటర్‌ ఫైట్‌ సాగుతోంది. గత ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మధ్యే ఉండగా ఈసారి ఆ పరిస్థితి మారిపోయింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ నిలిచింది. పరస్పర విమర్శలు, మాటల తూటాలతో ప్రధాన రాజకీయ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. 

ప్రజాకర్షక హామీలతో ఓట్లను పొందేందుకు, గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ మళ్లీ గ్రేటర్‌ పీఠాన్ని తామే దక్కించుకునేలా పావులు కదుపుతుంటే, దుబ్బాక ఇచ్చిన తీర్పుతో గ్రేటర్‌లోనూ తమ సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కొన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎంఐఎం పాతబస్తీ వరకు పదిలంగానే ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 3, 4 డివిజన్లలో స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాలతో జీహెచ్‌ఎంసీ ప్రాంతాలు హోరెత్తిపోతున్నాయి. 

అన్నీ తానై... కేటీఆర్‌
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు అన్నీ తానై గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటిచేత్తో గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన కేటీఆర్‌ ఈసారి కూడా తానే బాధ్యతను చేపట్టారు. గత ఎన్నికల్లో కేటీఆర్‌ నేతృత్వంలో 150 స్థానాల్లో పోటీచేసిన టీఆర్‌ఎస్‌ 99 స్థానాలను గెలుచుకుంది. ఇక ఈసారి 100 స్థానాల్లో గెలుస్తామని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. 20కి పైగా డివిజన్లు మినహా మిగతా చోట్ల పాతవారినే పోటీలో నిలిపింది. కొందరు సిట్టింగ్‌ కార్పొరేటర్లపై స్థాని కంగా వ్యతిరేకత ఉన్నా, వారిని గెలిపించుకునే బాధ్యతను మంత్రులకు అప్పగించింది.  బీఫారాలు పొందిన కొంతమందిపై కూడా వ్యతిరేకత కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. అయితే గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్‌ రోడ్‌షోలకు అనూహ్య స్పందన లభిస్తోంది. బీజేపీ  కాంగ్రెస్‌ పార్టీ నేతల విమర్శలకు కేటీఆర్‌ ధీటుగా సమాధానం ఇస్తున్నారు. 

దుబ్బాక విజయంతో నయాజోష్‌
దుబ్బాకలో తాము గెలిచిన వెంటనే గ్రేటర్‌ ఎన్నికలు రావడం తమకు మంచి అవకాశమని బీజేపీ భావిస్తోంది. దుబ్బాకలో ప్రదర్శించిన దూకుడును జీహెచ్‌ఎంసీలోనూ కొనసాగిస్తోంది. గత ఎన్నికల్లో 55 స్థానాల్లో పోటీ చేసినా 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి అధికారం లోకి వస్తామని చెబుతోంది. అయితే, 30కి పైచిలుకు స్థానాలను గెలుచుకుంటామని ఆ పార్టీలో అంతర్గత చర్చ లో ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. నాలుగు స్థానాలే ఉన్న తాము ఇపుడు 30 గెలిచినా, 40 గెలిచినా.. అది టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టినట్లే అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ అందుకు ఈ ఎన్నికలే పునాదిగా పరిగణిస్తోంది.  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తులను అక్కున చేర్చుకుంటూ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అమిత్‌షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, ప్రకాష్‌ జవదేకర్, స్మృతి ఇరానీ వంటి బిగ్‌ షాట్స్‌ను ప్రచారం లో ఉపయోగిస్తోంది. మరోవైపు బండి సంజయ్, అరవింద్‌ వంటి నేతల వ్యాఖ్యలు హిందూ ఓటర్లను  ఆకర్షిస్తు న్నాయన్న అంచనాలో పార్టీ ఉంది. 

ఎంఐఎం స్థానాలు పదిలమే!
గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీచేసి 44 స్థానాలను గెలుచుకున్న ఎంఐఎంకు ఈ ఎన్నికల్లో తమ సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకుంటామనే ధీమాతో ఉంది. ఓల్డ్‌సిటీపై తమకున్న పట్టును సడలనివ్వకూడదని శ్రమిస్తోంది. బీజేపీకి కొంత అనుకూలత ఏర్పడినా అది ఎంఐఎం గెలుపోటములపై ప్రభావం చూపబోదని ఆ పార్టీ వర్గాల అంచనా. అయితే పాతబస్తీలో ఏం జరుగుతుందన్నది మాత్రం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రేటర్‌లో వామపక్షాలు 20 –25 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి సీట్లు ఆశించిన భంగపడిన వారు, స్వతంత్రులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 95 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ ఒక్క స్థానమే గెలిచింది. ఈసారి ఎన్ని గెలుస్తుందో చూడాలి.

సగం స్థానాల్లో గట్టిపోటీ 
కాంగ్రెస్‌ పార్టీ గతంలోలాగే 150 డివిజన్లలో పోటీ చేస్తోంది. 2016లో రెండే డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్‌ ఇపుడు సగానికి పైగా స్థానాల్లో గట్టిపోటీ ఇస్తామని చెబుతోంది.  అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నా ఓటర్లను ఆకట్టుకునే స్టార్‌ క్యాంపెయినర్ల కొరత కనిపిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కూడా మేనిఫెస్టో బాగుందని, అదే తమ హీరో అని చెప్పారు.  రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి  పోటీ చేసిన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ గంపెడాశలు పెట్టుకుంది. మల్కాజిగిరిలో 47, చేవెళ్లలో 18 డివిజన్లు ఉన్నాయి. రెండు చోట్ల కలిపి  10 నుంచి 15 స్థానాలు గెలుస్తామన్న ధీమాతో కాంగ్రెస్‌ ఉంది.

ఉన్నత చదువులు, ఉద్యోగాలు 
ఈ ఎన్నికల్లో అగ్రతాంబూలం మహిళలకే దక్కింది. గ్రేటర్‌ మేయర్‌ పీఠం మహిళకు రిజర్వు చేయడం, సగం డివిజన్లు మహిళలకే కేటాయించడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాలు వదిలి పోటీలో నిలిచారు. ముఖ్యంగా 25 ఏళ్లలోపు మíహిళలు 20కి పైగా డివిజన్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీలో నిలిచారు. వారిని ఓటర్లు ఎంతమేరకు ఆదరిస్తారు..ఆయా పార్టీలు వారిని గెలుపు తీరాలకు ఎలా చేర్చుతాయన్నది ఆసక్తిగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement