ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా..? ఈ డైలాగ్ పండుగాడికే కాదు, అమిత్ పాలేకర్‌కు కూడా వర్తిస్తుంది. రాజకీయాలకు కొత్త. అయితేనేం గోవాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి ఎదిగారు. పార్టీలో చేరిన రెండు నెలల్లోనే గోవా వారసత్వ సంపద (సహజ వనరులు) కాపాడడానికి నిరాహారా దీక్షకు దిగి ప్రభుత్వం మెడలు వంచారు. కోవిడ్–19 సంక్షోభం నెలకొన్న వేళ మానవత్వంతో స్పందించి ఎందరి ప్రాణాలనో కాపాడారు. సామాజిక సమస్యల పట్ల అవగాహన ఎక్కువ. సామాజిక, ఆర్థిక తారతమ్యాలను రూపుమాపడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు. ఇప్పుడు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ గోవా ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు.
►1976 సంవత్సరంలో పుట్టారు. గోవా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు.
►కొద్ది రోజుల పాటు స్థానిక పత్రికలో జర్నలిస్టుగా పని చేశారు.
►అమిత్ పాలేకర్ తల్లి జ్యోతి పాలేకర్ బీజేపీ నాయకురాలు. మెర్సెస్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 25 ఏళ్ల పాటు కొనసాగారు. మనోహర్ పారికర్ మరణానంతరం ఆమె రాజకీయాలను వీడారు.
►తల్లి ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు అమిత్. సామాజిక సేవ చేయాలన్న కోరికతో ఆప్‌లో చేరారు. ఇప్పుడు తల్లి జ్యోతి కూడా అమిత్‌కు అండగా ఉన్నారు.
►వృత్తి రీత్యా లాయర్. సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్‌గా 22 సంవత్సరాలుగా పని చేశారు. సివిల్, క్రిమినల్ కేసులు వాదిస్తూ పేరు తెచ్చుకున్నారు.
►అమిత్ భార్య రషిక కూడా లాయరే. గోవాలో రెస్టారెంట్ కూడా నడుపుతూ ఉంటారు. వారికి ఆరేళ్ల కూతురు ఉంది.
►చిన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలు కనేవారు. కానీ తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో యుక్త వయసు నుంచి ఆర్థిక, సామాజిక తారతమ్యాలను రూపుమాపాలని ఆలోచించేవారు.
►కరోనా సెకండ్ వేవ్ సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేశారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు
►ఆక్సిజన్ కొరతపై తొలిసారిగా కోర్టుకెక్కిన కొంతమందిలో అమిత్ పాలేకర్ కూడా ఉన్నారు. 40 మందికిపైగా ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోవడంతో బాంబే హైకోర్టు (గోవా బెంచ్)లో పిటిషన్ దాఖలు చేశారు. ఆక్సిజన్ సరఫరా జరిగేలా చూశారు.
►అక్టోబర్ 2021లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
►పాత గోవాలో వారసత్వ సంపద పరిరక్షణకు చేసిన నిరాహార దీక్షతో పార్టీలోనూ, ప్రజల్లోనూ గుర్తింపు పొందారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ప్రశంసలు కూడా దక్కాయి.
►గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరుని 2022, జనవరి 19న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు.
►అమిత్ పాలేకర్ భండారీ వర్గానికి చెందిన ఓబీసీ నాయకుడు. గోవా జనాభాలో 35 శాతం ఈ వర్గానికి చెందిన వారే. అందుకే కేజ్రివాల్ వ్యూహాత్మకంగా అమిత్‌ను ఎంపిక చేశారన్న విశ్లేషణలు ఉన్నాయి.
►ఢిల్లీలో సాధించిన అభివృద్ధి గోవాలో జరగాలంటే ఆప్‌కే ఓటు వెయ్యండి అన్న నినాదంతో ముందుకు వెళుతున్నారు.
►పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ఆ పని తాను చేస్తామని అమిత్ ప్రచారం చేసుకుంటున్నారు.
►ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని కోరుతున్నారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
నిరాహార దీక్షతో గుర్తింపు
ఆప్‌లో చేరిన రెండు నెలల్లోనే పాత గోవాలోని వారసత్వ ప్రాంతమైన గొయెమ్‌కార్పాను పరిరక్షించడానికి, అందులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగారు. మొదట్లో ఎవరూ ఈ దీక్షని పట్టించుకోలేదు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితులు మారిపోయాయి. అమిత్ దీక్షకు స్థానిక ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీక్షా శిబిరానికి జనం వెల్లువెత్తారు. దీంతో అయిదు రోజుల్లోనే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ నిర్మాణాలను కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అమిత్ సాధించిన తొలి విజయం అది.
Comments
Please login to add a commentAdd a comment