అభివృద్ధికి అందలమా..మార్పునకు పట్టమా? | Ground report from Combined Nalgonda District | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి అందలమా..మార్పునకు పట్టమా?

Published Wed, Nov 22 2023 4:42 AM | Last Updated on Wed, Nov 22 2023 4:42 AM

Ground report from Combined Nalgonda District - Sakshi

ఉద్యమాల గడ్డ.. రాజకీయ చైతన్య అడ్డా..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ సమీకరణలు మారాయి. 2018 నాటికి జిల్లాలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్‌ఎస్‌ పట్టు సాధించింది. 2014 తర్వాత సీపీఐ నుంచి ఒకరు గెలిచినా, కాంగ్రెస్‌ నుంచి ఇంకొకరు గెలిచినా.. ఇద్దరూ బీఆర్‌ఎస్‌లోకి చేరిపోవడంతో మొత్తం గులాబీదళమైంది.

ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్‌.. నాగార్జున సాగర్‌... మునుగోడుల్లోనూ గులాబీ వికసించింది. ఇప్పుడు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఢీ.. అంటే ఢీ అనే వాతావరణం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో నెలకొన్న  క్షేత్రస్థాయి రాజకీయ ముఖచిత్రంపై ప్రత్యేక కథనం...  

నల్లగొండ   జనం ఎవరి వెంటో?
ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య రసవత్తర పోరు సాగుతోంది. బరిలో ఉన్న  బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, సీపీఎం అభ్యర్థి  సుధాకర్‌రెడ్డి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మెడికల్‌ కాలేజీ, ఐటీ హబ్‌ రావడం. రహదారుల విస్తరణ, పట్టణ సుందరీకరణ, పార్కుల అభివృద్ధి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల ప్రచారాస్త్రాలుగా మారాయి.  కానీ సొంతపార్టీలో  పెరిగిన అసంతృప్తి,  ప్రత్యర్థుల ఆరోపణలు ఆయనకు తలనొప్పిగా మారాయి.

ఇక ఎలాగైనా ఈ స్థానం దక్కించుకోవాలన్నది కోమటిరెడ్డి ఎత్తుగడ. అధికార పార్టీలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. ఎంపీగా గెలిచాక నల్లగొండకు దూరమయ్యారనేది కోమటిరెడ్డికి మైనస్‌ పాయింట్‌. 1999 నుంచి నాలుగుసార్లు గెలిచిన కోమటిరెడ్డి, 2018లో కంచర్ల చేతిలో 23 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. గతంలో విజయ వ్యూహాలు, కాంగ్రెస్‌ మార్పు నినాదంపై ఆయన నమ్మకం పెట్టుకున్నారు. నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, కనగల్‌ ఓటర్ల తీర్పే ఈ ఇద్దరికీ కీలకం. 

నకిరేకల్‌  ఆ ఇద్దరే..! 
చిరుమర్తి లింగయ్య ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి. 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ఆ తర్వాత పార్టీ మారారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వీరిద్దరి మధ్యే ఇక్కడ పోటీ. 2018లో చిరుమర్తికి 8,259 ఓట్ల మెజారిటీ వచ్చింది. బీఆర్‌ఎస్‌లో ఆయనకు వర్గపోరు ఉంది. వేముల వీరేశంకు బీఆర్‌ఎస్‌లోని కొంతమంది సహకరిస్తున్నారనే భయం లింగయ్యను వెంటాడుతోంది. సంప్రదాయ ఓటు బ్యాంకు, బీఆర్‌ఎస్‌లో మిత్రులు, సిట్టింగ్‌పై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని వీరేశం భావిస్తున్నారు. 

దేవరకొండ  ‘నాయక్‌’ ఎవరు? 
కాంగ్రెస్, కమ్యూనిస్టుల అడ్డా దేవరకొండలో తెలంగాణ ఏర్పడ్డాక సమీకరణలు మారాయి. 2014లో సీపీఐ టికెట్‌పై గెలిచిన రమావత్‌ రవీంద్రకుమార్‌ నాటి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. 2018లోనూ ఆయన విజయం సాధించారు. ఇప్పుడూ ఆయనే బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బాలూనాయక్‌తో తలపడుతున్నారు. గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆధిపత్యమున్న ఈ స్థానంలో ఈసారి  గెలుపోటములపై ఉత్కంఠ కొనసాగుతోంది.

బీఆర్‌ఎస్‌ హయాంలో సాగిన అభివృద్ధి ఎమ్మెల్యేపై వ్యతిరేకతను డామినేట్‌ చేస్తోందని ఆ పార్టీ వారే చెప్పుకుంటున్నారు. దళితబంధులో కమీషన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో ప్రజాగ్రహం కాంగ్రెస్‌ ప్రచారా్రస్తాలుగా మారాయి. ఏడాదిగా బాలూ నాయక్‌ ప్రజలతో మమేకమై రాజకీయ యుద్ధానికి సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌. ఈ నేపథ్యంలో ఎవరి బలం ఎంతో తేలాల్సి ఉంది.  

తుంగతుర్తి  తేడా ఒక్క శాతమే..
ఒక్క శాతం ఓట్లే ఇక్కడ జయాపజయాలను నిర్ణయిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిశోర్, కాంగ్రెస్‌ నుంచి మందుల సామేల్‌ మధ్యే ప్రధాన పోటీ. నిజానికి ఈ స్థానాన్ని అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్‌ తొలుత కేటాయించింది. ఆఖరి నిమిషంలో సామేల్‌ తెరమీదకొచ్చారు. దయాకర్‌ హైకమాండ్‌ బుజ్జగింపుతో తప్పుకున్నారు. ఆయన గత రెండు పర్యాయాలు ఒక్క శాతం ఓటుతోనే ఓడిపోయారు.

సామేల్‌కు మద్దతిస్తున్న ఆయనకు ప్రజల్లోనూ సానుభూతి ఉంది. ఇదే ఆ 
పార్టీకి సానుకూలాంశం. అధికార పార్టీ అభ్యర్థి రెండుసార్లు గెలిచిన అనుభవం, అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తున్నారు. అయితే, దళిత బంధు, డబుల్‌ బెడ్‌రూం కేటాయింపుల్లో అవినీతిపై ఎదురయ్యే దాడి ప్రతికూలంగా ఉంది. ఇది ఏమేర ప్రభావం చూపుతుందనేదే ఇక్కడ గెలుపోటములను నిర్ణయిస్తుంది. 

మునుగోడు   మజా.. 
ఉపఎన్నికతో దేశవ్యాప్తంగా ఆకర్షించిన మునుగోడు రాజకీయం ఇప్పడూ రసవత్తరంగానే ఉంది.  2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి 2022లో బీజేపీలోకి వెళ్లి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన గెలుపు కోసం యావత్‌ బీఆర్‌ఎస్‌ నాయకత్వం సర్వశక్తులొడ్డింది. ఇప్పుడు రాజకీయం మారింది.

కోమటిరెడ్డి మళ్లీ పార్టీ మారి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు.  ఇక కూసుకుంట్ల కోసం ఉప ఎన్నికల మాదిరి పార్టీ మొత్తం పనిచేసే పరిస్థితి లేదు. అభివృద్ధి నినాదంతో ఆయన బరిలో ఉంటే..ఉపపోరులో కలసి ఉన్న సీపీఎం ఈసారి పోటీలో ఉంది.

స్వల్ప మెజారిటీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కామ్రేడ్ల పోటీ వల్ల కూసుకుంట్లలో కలవరం లేకపోలేదు. పాల్వాయి  స్రవంతి వల్ల ఏమేర నష్టం ఉంటుందనే ఆందోళన కోమటిరెడ్డిలోనూ లేకపోలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లమల కృష్ణారెడ్డి ప్రభావమూ కీలకమే. ఎన్ని ఓట్లు ఈ పార్టీ సాధిస్తుందనేది ఆసక్తి కల్గించే అంశం.  

సూర్యాపేట   సిరి ఎవరిదో? 
అధికార పార్టీ నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బీజేపీ నుంచి సంకేనేని వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. 2018లో జగదీశ్‌రెడ్డి కేవలం 5,900 ఓట్ల మెజారిటీతో తెలిచారు. అప్పట్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన పటేల్‌ రమేశ్‌రెడ్డి ఏఐ ఎఫ్‌బీ తరపున పోటీ చేయడం కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు గండి పడింది. ఈసారి ఈయన్ను అధిష్టానం ఒప్పించి, బరిలో లేకుండా చేసింది.

ఇది తమకు కలిసి వస్తుందనేది కాంగ్రెస్‌ వాదన. దీంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఆ పార్టీ ఫోకస్‌ పెట్టింది. జగదీశ్‌రెడ్డి అభివృద్ధి పనులపై ప్రజల్లో మంచి పేరుంది. ఇవే గెలిపిస్తాయనేది ఆయన నమ్మకం. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు కూడా 39 వేల వరకూ ఉంటుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనన్న కాంగ్రెస్‌ ప్రచారంతో బీజేపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందా? అనే సందేహాలున్నాయి. ఇవి ఓటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు. 

వారసుల సాగరం విజేతెవరో? 
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుందూరు జానారెడ్డి కుమా రుడు జయవీర్‌రెడ్డి, దివంగత నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌ పోటీ పడుతున్నారు. 2018లో ఓటమి చవి చూసిన జానారెడ్డి వారసుడి గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తన రాజకీయ అనుభవాన్ని రంగరించి పనిచేస్తున్నారు. ఉప ఎన్నికలో నోముల భగత్‌ విజయానికి పార్టీ యావత్‌ కృషి చేసింది. ఇప్పుడు ఒంటరిగానే ప్రచార బరిలో నిలిచారు.

తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి ఉప ఎన్నికల్లో గెలిపిస్తే..ఆ తర్వాత జరిగిన అభివృద్ధి ఈసారి గెలుపునకు మార్గమన్నది ఆయన వాదన. అనుభవ రాహిత్యంతో కేడర్‌ దూరమైందనేది అక్కడ పరిశీలన. జానారెడ్డి వ్యూహాలను ఎలా తిప్పికొడతాడనే దానిపై ఆయన విజయా వకాశాలుండే వీలుంది. కాంగ్రెస్‌కు కలిసి వచ్చే మార్పు నినాదం, పాతుకుపోయిన కేడర్‌ కుందూరు బలాలుగా చెప్పుకుంటున్నారు. 

భువనగిరి   ఎవరి బలమెంత? 
ఇక్కడ పార్టీల ఆధిపత్యం తరచూ మారుతుంటుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌ మధ్యనే పోటీ ఉంది.  బీజేపీ, సీపీఎంది నామమాత్రపు పోటీనే. ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో మంచినీరు అందించడం శేఖర్‌రెడ్డి సాధించిన విజయంగా ప్రచారబరిలో ఉన్నారు. ప్రజల్లోనే ఉంటారనే పేరూ ఉంది. అయితే రైతుల ఆందోళన సందర్భంగా జరిగిన అరెస్టులపై జనం కాస్త వ్యతిరేకంగా ఉన్నారు.

సొంతపార్టీలో వర్గపోరూ ఇబ్బందిగా ఉంది. కుంభం అనిల్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ మార్పు నినాదం, ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిసి వచ్చే అంశాలు. కానీ పార్టీలు మారతారనే అంశం ప్రతికూలంగా ఉంది. ఎస్సీలు 20, గౌడ్‌ 13, రెడ్డి 10, యాదవ 10, పద్మశాలీ 8, ముదిరాజులు 8 శాతం ఇక్కడున్నారు.  ఎస్సీ, గౌడ ఓటర్లతో పాటు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికార పార్టీలో ఉన్న వర్గపోరు వల్ల తనకు వస్తాయనేది అనిల్‌ నమ్మకం.  

 జీ ‘హుజూర్‌’  ఎవరికో ? 
ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి (బీఆర్‌ఎస్‌), సీనియర్‌నేత ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంది. 1999 నుంచి ఉత్తమ్‌ ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఎంపీగా వెళ్లడంతో 2019లో ఉప ఎన్నిక జరిగింది. బీఆర్‌ఎస్‌ సైదిరెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తమ్‌ సతీమణి పద్మావతి ఉప పోరులో తలపడ్డా, కాంగ్రెస్‌ అపజయం చవిచూసింది.

ఈసారి ఉత్తమ్‌ బరిలో ఉండటం, బీఆర్‌ఎస్‌ నుంచి వలసలు ఎక్కువ ఉండటంతో తమ గెలుపుపై ఉత్తమ్‌ ధీమాగా ఉన్నారు. సొంత పార్టీలో వర్గపోరు సర్దుకుంటే సైదిరెడ్డి కొన్ని ప్రాంతాల్లో ఓట్లు రాబట్టే వీలుంది. ఈ దిశగా అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ, సీపీఎం  ఇక్కడ పోటీలో ఉన్నా  వీరు ఎవరి ఓట్లు చీలుస్తారు? బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ శ్రేణులు ఆఖరి నిమిషంలో వదిలే ప్రచారాస్త్రాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. 

కోదాడ   కొత్త రాజకీయం 
కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్‌ (బీఆర్‌ఎస్‌), ఎన్‌ పద్మావతిరెడ్డి (కాంగ్రెస్‌) హోరాహోరీగా తలపడుతున్నారు. పద్మావతి ఉత్తమ్‌ సతీమణి. 2014లో ఆమె గెలిచినా, 2018లో మల్లయ్యయాదవ్‌ చేతిలో కేవలం 756 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్లో టీడీపీ మద్దతివ్వడం..బీఆర్‌ఎస్‌ తెలంగాణ సెంటిమెంట్‌ రాజేయడంతో పద్మావతికి ప్రతికూలత ఏర్పడింది. ఈసారి ఇక్కడ అనేక రాజకీయ సమీకరణలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రకు సరిహద్దు స్థానం కావడం, టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడం పద్మావతికి కలిసి వచ్చే అంశాలు. యాదవ్‌ను గత ఎన్నికల్లో బలంగా వెనకేసుకొచ్చిన చందర్‌రావు ఈసారి వ్యతిరేకంగా ఉన్నాడనేది మల్లయ్యయాదవ్‌లో కనిపిస్తున్న కలవరం. అవినీతి ఆరోపణలు ఆయనకు మైనస్‌ పాయింట్‌గా ఉంది. బలమైన బీఆర్‌ఎస్‌ నేతలూ కాంగ్రెస్‌ బాట  పట్టడం మరో ప్రతికూలత. అభివృద్ధి మంత్రమే గెలిపిస్తుందని ఆయన నమ్ముతున్నారు. 

ఆలేరు..  ఆ సెంటిమెంట్‌పైనే చర్చ 
ఇక్కడ ఒక పార్టీ నుంచి వరుసగా మూడోసారి గెలిచిన దాఖలాల్లేవు. ఇదే ఇప్పుడు రాజకీయ చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్‌ నుంచి గొంగిడి సునీత ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. మరోసారి పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీర్ల ఐలయ్య గట్టి పోటీనే ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్‌ పార్టీ సంప్రదాయ ఓటర్‌ను కాపాడుకునే పనిలో ఉన్నారు. 8 మండలాలున్న ఈ స్థానంలో గౌడ ఓటర్లు 40 వేలు, యాదవ ఓటర్లు 38 వేలుంటారు.

వీళ్లే ఇక్కడ  ప్రభావం చూపనున్నారు. యాదాద్రి టెంపుల్‌ను బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ చేస్తోంది. మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకోగలననే నమ్మకాన్ని సునీత వ్యక్తం చేస్తున్నారు. అయితే, సొంత పార్టీ నేతలే కలిసిరాని ప్రతికూలతను ఆమె ఎదుర్కొంటున్నారు. ఐలయ్యకు జిల్లా నేతల ఆశీస్సులుండటం, కాంగ్రెస్‌ గాలి వీస్తోందన్న ప్రచారం సానుకూలాంశాలుగా చెబుతున్నారు. పార్టీలో చేరికలు ఈయనకు కలిసి వచ్చే అంశం. 

మిర్యాలగూడ  ఘాటెవరికో? 
బీఆర్‌ఎస్‌ తరపున నల్లమోతు భాస్కర్‌రావు సిట్టింగ్‌ ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ ఆయనపై పోటీకి బత్తుల లక్ష్మారెడ్డిని బరిలోకి తెచ్చింది. సీపీఎం తరపున జూలకంటి రంగారెడ్డి తలపడుతున్నారు. సాధినేని శ్రీనివాసరావును బీజేపీ రంగంలోకి దించింది. బీఎల్‌­ఆర్‌గా ప్రజాక్షేత్రంలో సామాజిక కార్యక్రమాలతో కొన్నేళ్లుగా లక్ష్మారెడ్డి దూసుకెళ్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కొంతమంది వ్యతిరేకించినా, కాంగ్రెస్‌ జిల్లా నేతలు బుజ్జగించి దారికి తెచ్చారు.

2018లో ఇక్కడ భాస్కర్‌రావుకు 30 వేల మెజారిటీ వచ్చింది. స్కైలాబ్‌ నాయక్‌ 2018లో కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేసి, 14 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి ఆయన కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ గెలుపు  తథ్యమనేది వారి వాదన. ఇక్కడ సంప్రదాయ సీపీఎం ఓట్లు 10 వేలు ఉంటాయి. దీంతో స్వల్ప మెజారిటీతోనే ఎవరైనా గెలిచే వీలుందని తెలుస్తోంది.  

విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి 
విద్యారంగంలో మంచి మార్పులొస్తే ఎన్నో రంగాల్లో సమూల మార్పులొస్తాయి. అందుకే  ఏ రాజకీయ పార్టీ గెలిచినా విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. నిధులు పెంచాలి.. అప్పుడే నాణ్యమైన విద్య అందించడం సాధ్యమవుతుంది. అన్నివర్గాలకూ అది ఉపయుక్తంగా ఉంటుంది.   –మంత్రి ప్రగడ కనకయ్య  

వాళ్లేం చేస్తారో చూద్దాం
తెలంగాణ తెచ్చిన బీఆర్‌ఎస్‌ పాలన చూశాం. ఇచ్చిన కాంగ్రెస్‌  పాలనా చూద్దాం. ఒకసారి అవకాశమిద్దాం. అయితే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.  
– కొండా కనకమ్మ, రైతుకూలీ, చిలుకూరు 

మధ్యతరగతి నలిగిపోతోంది
ఏ పార్టీలైనా మధ్యతరగతి గోడు పట్టించుకోవడం లేదు. ఓట్ల రాజకీయాలు తప్ప, అన్నింటా నలిగిపోతున్నది మధ్య తరగతి ప్రజలే. వాళ్లగురించి పాలకులు సానుకూలంగా ఆలోచించాలి.  – వంగాల మాధవి, గృహిణి, మిర్యాలగూడ 

ఉద్యోగాలు ఇవ్వాలి 
లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లేదు.  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఓ పద్ధతిగా జరగాలి. ప్రైవేటు ఉద్యోగాలు వచ్చే నైపుణ్యం పెంచాలి.    –కొరడాల సాయికుమార్, చివ్వెంల, సూర్యాపేట 

-ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వనం దుర్గాప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement