
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి.. పట్టపగలు మద్యం సేవించి మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాగుతున్నారని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. మంత్రి గౌతమ్‌రెడ్డి దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారని, ఇంతటి మహా విషాదాన్ని తమ పార్టీయే కాక రాష్ట్రమంతా భరించలేకపోతోందని... ఈ దశలో ఇంతకు దిగజారి తాగుబోతు మాటలు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.
చంద్రబాబు తమ నాయకులను మరీ ఇంత నీచంగా మద్యం తాగించి మాట్లాడించటం బాధాకరమన్నారు. టీడీపీ దిగజారుడుతనానికి ఇంతకన్నా పరాకాష్ట ఏం ఉంటుందని ప్రశ్నించారు. వారం రోజుల పాటు దుబాయ్‌లో నిర్వహించిన ఎక్స్‌పోలో పాల్గొన్న మంత్రి ఏపీలో రూ.5 వేల కోట్లు పైచిలుకు ఒప్పందాలు చేసుకొని విజయవంతంగా వచ్చారని, అసలైన ఎంవోయూలు ఎలా ఉంటాయో చూపిద్దామని తన సన్నిహితులతో కూడా వ్యాఖ్యానించారని, ఇలా సంతోషంగా ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించటం బాధాకరమన్నారు. ఈ ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు... తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment