లక్నో: ఇటీవల కొత్తగా ఎంపికైన ఇండియా కూటమిలోని ఆరుగురు ఎంపీలు తమ పదవుల్ని కోల్పోనున్నారా? క్రిమినల్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఆరుగురు ఎంపీలకు రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడనుందా? అదే జరిగితే వారు పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.
సాధారణ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన ఆరుగురు ఇండియా కూటమి ఎంపీలకు పదవీ గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆరుగురు క్రిమినల్ కేసులు ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. అదే జరిగితే ఈ ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం.
ఇక ఆ ఆరుగురిలో ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అఫ్జల్ అన్సారీ ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. అతని నేరారోపణపై అలహాబాద్ హైకోర్టు గత నెలలో స్టే విధించింది. దీంతో ఆయన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్జల్ అన్సారీ కేసును జులైలో కోర్టు విచారించనుంది. కోర్టు శిక్షను సమర్థిస్తే అన్సారీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.
అజంగఢ్ సీటును గెలుచుకున్న ధర్మేంద్ర యాదవ్‌పై కూడా నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అతను దోషిగా తేలితే రెండేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. దీంతో ఆయన సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
మాయావతి హయాంలో మంత్రిగా పనిచేసిన బాబు సింగ్ కుష్వాహా నేషనల్ రూరల్ హెల్త్ మెషిన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) స్కామ్‌కు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై నమోదైన 25 కేసుల్లో ఎనిమిదింటిపై అభియోగాలు నమోదయ్యాయి.
సుల్తాన్‌పూర్ స్థానం నుంచి గెలుపొందిన రాంభూల్ నిషాద్‌పై గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద ఒక కేసుతో సహా ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
చందౌలీ లోక్‌సభ స్థానం నుంచి మాజీ మంత్రి మహేంద్ర నాథ్ పాండేపై విజయం సాధించిన వీరేంద్ర సింగ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
సహరాన్‌పూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
నగీనా రిజర్వ్‌డ్ స్థానంలో గెలిచిన సమాజ్ పార్టీకి చెందిన ఏడో అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్‌పై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏదైనా ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడితే అతని రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.అనేక మంది రాజకీయ నేతలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి తమ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment