రజనీకి అర్థమైనా.. గజనీలకు అర్థం కావడంలేదు  | Harish Rao has responded to recent comments made by Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీకి అర్థమైనా.. గజనీలకు అర్థం కావడంలేదు 

Published Sun, Apr 30 2023 3:35 AM | Last Updated on Sun, Apr 30 2023 5:25 AM

Harish Rao has responded to recent comments made by Rajinikanth  - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి వేరే రాష్ట్రంలో ఉన్న రజనీకాంత్‌కు అర్థమైంది కానీ.. ఇక్కడే ఉన్న గజనీలకు అర్థం కావడం లేదు’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో హైదరాబాద్‌ అభివృద్ధిపై మాట్లాడారని, సీఎం కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ న్యూయార్క్‌లా ఉందని ప్రశంసించారని ఆయన పేర్కొన్నారు.

శనివారం సంగారెడ్డి జిల్లా కందిలో వీరశైవలింగాయత్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ సర్కా రును ఎందుకు గద్దెదించుతారని ప్రశ్నించారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్, రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు గద్దెదించుతారా? అని ప్రశ్నించారు.  

లింగాయత్‌లను ఓబీసీల్లో చేర్చేందుకు మద్దతు  
తెలంగాణలో లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ఈ అంశంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఇతర బీజేపీ నేతలు లింగాయత్‌లను ఓబీసీల్లో చేర్చేలా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బి.బి.పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీసీఎం చైర్మన్‌ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కుంభమేళాలో భాగంగా మంత్రి హరీశ్‌రావు పంచవటిలో మంజీర నది వద్ద గంగాదేవికి పూజలు చేశారు. అనంతరం మహా మంగళ హారతి నిర్వహించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement