లిక్కర్ కింగ్ మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట
వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు
టీడీపీ అభ్యర్థుల్లో అత్యధికులపై భారీగా క్రిమినల్ కేసులు
సాక్షి నెట్‌వర్క్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2022–23లో ఆదాయం రూ.10 కోట్లు, స్థిరాస్తులు రూ.103 కోట్లు, చరాస్తులు రూ.82 కోట్లు కలిపి బాలయ్యకు మొత్తం రూ.185 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు.
నందమూరి హిందూ అవిభాజ్య కుటుంబంలో బాలకృష్ణకు స్థిరాస్తులు రూ.28.91 కోట్లు, చరాస్తులు రూ.2.41 కోట్లుగా చూపారు. బాలయ్య సతీమణి వసు«ంధర పేరిట రూ.179.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. అందులో స్థిరాస్తులు రూ.38.90 కోట్లు, చరాస్తుల విలువ రూ.140.38 కోట్లుగా చూపారు. కుమారుడు మోక్షజ్ఞ పేరిట స్థిరాస్తులు రూ.11.11 కోట్లు, చరాస్తులు రూ.58.64 కోట్లు కలిపి బాలకృష్ణ కుటుంబానికి మొత్తం ఆస్తుల విలువ రూ.465.35 కోట్లుగా చూపారు.
అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు
చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61,500, అతని భార్య పేరిట రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు దళితులపై దూషణలు చేయడం.. అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి.
మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట
దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ.. ఆయన చేతిలో ఉన్న నగదు రూ.18,529 మాత్రమేనట. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో ఉన్న నగదుతో పాటు భార్య వద్ద రూ.6,68,134, ఉమ్మడి కుటుంబ సభ్యుల (హెచ్‌యూఎఫ్) వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు.
చరాస్థుల కింద తనకు రూ.4,58,30,319 ఉండగా.. భార్య పేరిట రూ.17,98,70,139, ఉమ్మడి కుటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు తెలిపారు. తన పేరిట రూ.1.09 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. భార్య పేరిట రూ.30,04,44,600, ఉమ్మడి కుటుంబ సభ్యుల కింద రూ.4,29,44,876 ఉన్నట్టు పేర్కొన్నారు.
కేసుల చిట్టా విప్పిన బొండా ఉమా
విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు (ఉమా) ఎన్నికల అఫిడవిట్‌లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తనపై 23 కేసుల నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా రూ.98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు.
కావలి అభ్యర్థికీ కారు లేదట!
కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అతని పేరున రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరిట రూ.5.67 కోట్లు చర, స్థిరాస్తులున్నట్టు చూపారు. కృష్ణారెడ్డి కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు
కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్‌రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. ఆ దంపతులిద్దరికీ రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment