రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ తనను అరెస్టు చేయడంలో గవర్నర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. చంపయ్ సొరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొనడానికి హేమంత్ సొరెన్‌కు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన అరెస్టును భారత ప్రజాస్వామ్యంలో నల్ల అధ్యాయం అని అన్నారు.
భూ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని నిరూపించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు హేమంత్ సొరెన్ సవాలు విసిరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎలాగో వారి నుండి నేర్చుకోవాలని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నేరం రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తన అరెస్టుకు 2022 నుంచి కుట్ర చేస్తున్నారని చెప్పారు.
"మేము ఇంకా ఓటమిని అంగీకరించలేదు. నన్ను కటకటాల వెనక్కి నెట్టి విజయం సాధించగలమని భావిస్తే, జార్ఖండ్‌లో ప్రతి మూలలో గిరిజనులు, దళితులు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు." అని హేమంత్ సోరెన్ అన్నారు.
'కేంద్రం 2019 తర్వాత స్కామ్‌లను మాత్రమే చూస్తోంది. 2000లలో జరిగిన స్కామ్‌లను చూడలేరు. గిరిజనులు రాష్ట్రాలకు చీఫ్‌లుగా, IAS లేదా IPS కావాలని కేంద్రం కోరుకోవడం లేదు. గిరిజన నాయకుల ప్రభుత్వాల కాలవ్యవధిని శాంతియుతంగా పూర్తి చేయనివ్వరు. నాకు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది' అని హేమంత్ సొరెన్ అన్నారు.
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ కూటమి తరుపున హేమంత్ సొరెన్ సన్నిహితుడు చంపయ్ సొరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఉందని నేడు అసెంబ్లీలో బలప్రదర్శన జరుగుతోంది.
ఇదీ చదవండి:రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష
Comments
Please login to add a commentAdd a comment