Huge Bettings On Huzurabad Bypoll Crossed Rs 100 Crores - Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్‌..?

Published Tue, Oct 26 2021 9:09 AM | Last Updated on Tue, Oct 26 2021 1:26 PM

Huzurabad Bypoll: Betting on Huzurabad ByPolls - Sakshi

‘హలో అన్న నేను ఆంధ్రా నుంచి మాట్లాడుతున్నా.. అప్పుడెప్పుడో హైదరాబాద్‌లో కలిశాం.. బాగున్నారా.. మీది హుజూరాబాద్‌ అసెంబ్లీ కిందకే వస్తుంది కదా.. మీ దగ్గర ఏ పార్టీ గెలుస్తదన్నా.. ఏ టీవీ పెట్టినా మీ గురించే వస్తుంది.. అందాద ఎవరూ గెలిచేలా ఉన్నారు’ అంటూ హుజూరాబాద్‌కు చెందిన వ్యక్తికి ఫోన్‌ వచ్చింది. ‘అన్నా ఎందుకే అన్ని అడుగుతున్నావ్‌ అంటే.. ‘మా దగ్గర మీ ఎన్నిక గురించి బెట్టింగ్‌ సాగుతుందన్నా.. ఎవరూ గెలిచేలా ఉన్నారో క్లూ ఇస్తే నేను కూడా ఒక చెయ్యి వేస్తా అన్నా’.. ఇటీవల హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో ఆంధ్రాకు చెందిన వ్యక్తి ఫోన్‌లో సంభాషించిన తీరు ఇదీ. అంటే హుజూరాబాద్‌ ఎన్నికపై బెట్టింగ్‌లు ఎలా జరుగుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

సాక్షి, కరీంనగర్‌క్రైం: వందకు వెయ్యి.. వెయ్యికి పది వేలు, పదివేలకు లక్ష అంటూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది.. ఎన్ని ఓట్ల తేడాలో గెలుస్తుంది.. ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. బెట్టింగ్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో రహస్యంగా కొనసాగుతున్నట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల వారు ఆసక్తిగా పాల్గొంటున్నారని సమాచారం. ఇటీవల ఐపీఎల్‌ కూడా ముగియడంతో పందెరాయుళ్లు ఉప ఎన్నికపై బెట్టింగ్‌ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు.

100 కోట్లు దాటిన బెట్టింగ్‌..?
హుజూరాబాద్‌ ఉపఎన్నికపై గత నెల నుంచే మొదలైన బెట్టింగ్‌ గడువు సమీపించడంతో మరింత జోరందుకుంది. తెలంగాణతోపాటు ఆంధ్రా నుంచి విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నంతో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్, నాందెడ్, ముంబయ్‌ వంటి ప్రాంతాల వారు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రా నాయకులు ఇక్కడ తెలిసిన వారికి ఫోన్‌ చేసి ఏ పార్టీ గెలుస్తుంది.. ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశాలున్నాయంటూ టచ్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం ఆంధ్రాకు చెందినవారు వాహనాల్లో హుజూరాబాద్‌కు వచ్చి ప్రచార శైలిని చూశారంటే అర్థం చేసుకోవచ్చు ఉప ఎన్నిక ఉత్కంఠ ఏ స్థాయిలో ఉందో. ఆంధ్రాలో ఎక్కువ శాతం ఐపీఎల్‌ బెట్టింగ్‌లు కట్టినవారు అది ముగియడంతో ఇప్పుడు ఉప ఎన్నికపై దృష్టి పెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే బెట్టింగ్‌ విలువ రూ.100 కోట్ల పైగానే దాటినట్లు అంచనా.

అంతా ఆన్‌లైన్‌లోనే..
హుజూరాబాద్‌ ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్‌ నిర్వహించే బుకీలు ఆన్‌లైన్‌లోనే దందా నడుపుతున్నట్లు తెలిసింది. రూపాయికి రూ.10, కొన్ని చోట్ల రూపాయికి రూ.1000 ఇలా కోట్లాది రూపాయాలు బెట్టింగ్‌ సాగుతోంది. 15 రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఏ నలుగురు కలిసినా ఉప ఎన్నిక గురించి పెద్దస్థాయిలో చర్చిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే సరికి సుమారు 300 కోట్ల బెట్టింగ్‌లు జరుగుతాయని చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా వారం రోజుల తర్వాత ఏ పార్టీ గెలుస్తుందో.. ఎవరు ఓడుతారో తెలిసేవరకు వేచిచూడాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement