
సాక్షి, కరీంనగర్: రాష్ట్రమంతా హుజూరాబాద్ ఉపఎన్నిక ఎంతో ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర రాజకీయాలు, అన్ని పార్టీల ఎజెండాలు హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్నాయి. ఓవైపు ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్, బీజేపీలు దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ఇంతవరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. నిన్నమొన్నటిదాకా కొండాసురేఖ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారనుకుంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా పీసీసీ తీసుకున్న నిర్ణయంపై పార్టీ నేతలు, కార్యకర్తలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
చదవండి: మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల
బలమైన అభ్యర్థి కోసం ఇంతకాలం ఎంతో అన్వేషణ జరిపిన కాంగ్రెస్ పార్టీ హజూరాబాద్‌లో పోటీ చేసేందుకు ఆసక్తిదారుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. గాంధీభవన్ నుంచి ఈ పరిణామాన్ని తాము ఊహించలేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర పార్టీలు ప్రచారంలో ముందంజలో ఉంటే, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పార్టీశ్రేణులను అయోమయంలో పడేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు
6న ఇంటర్వ్యూలు.
హుజూరాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ ఆశావహుల నుంచి సెప్టెంబరు 1 నుంచి 5 రోజులపాటు దరఖాస్తులు ఆహ్వనించారు. ఆశావహులు గాంధీభవన్‌లో రూ.5 వేల డీడీతో దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తుల ఆధారంగా 6వ తేదీ నుంచి సీనియర్ నేతలతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. సీనియర్ నేతలైన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ కమిటీ సభ్యులుగా ఉంటారు. ఆ తరువాతే అభ్యర్థి ప్రకటన ఉంటుంది.
వాస్తవానికి మొదట్లో హుజూరాబాద్ స్థానంలో అభ్యర్థులుగా కవ్వంపల్లి సత్యనారాయణ, పత్తి క్రిష్ణారెడ్డి పేర్లు తెరపైకి వచ్చినా.. అధిష్టానం కొండాసురేఖ వైపే మొగ్గు చూపింది. సురేఖ పేరును లాంఛనంగా ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని పార్టీ ప్రకటించడంతో కార్యకర్తల్లో కాస్త గందరగోళం నెలకొంది. దీనిపై సీనియర్ నేతలు మాట్లాడుతూ.. పార్టీ విధివిధానాల మేరకు దరఖాస్తులు, ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహిస్తున్నారని, అంతిమంగా కొండాసురేఖ పేరు ప్రకటిస్తారని వెల్లడించారు. మొత్తానికి సెప్టెంబరు 17వ తేదీనాటికి అభ్యర్థిని ప్రకటించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment