
సాక్షి, కరీంనగర్: వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్ ఇవాళ ఉత్తముడు కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చిందన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా రెండో రోజు రేవంత్ రెడ్డి ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అంటున్న కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనలేని పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మంత్రి హరీశ్‌రావు ఇద్దరు ఒక్కటేనని విమర్శించారు.
చదవండి: (పొమ్మనలేక పొగపెట్టారు: ఈటల)
లీటర్ పెట్రోల్‌పై రూ.65 పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. మోదీ, కేసీఆర్ కలిసి ప్రజలను పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న వారికి ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. పింఛన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి కసబ్‌గా మారి పారిపోయాడని, అందుకే అభ్యర్థి ఎంపికలో ఆలస్యమైందన్నారు. ప్రజాసమస్యలు నిరుద్యోగ సమస్యలపై ఏడేళ్లుగా పోరాడుతున్న బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా తీసుకువచ్చామని ఓటు వేసి బల్మూరి వెంకట్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment