
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఎన్నికలపై ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ పోటీలో తాను ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని ఆమె వెల్లడించారు. ఈటల రాజేందర్ పోటీకి దూరంగా ఉంటారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కూడా తన భర్త ఈటల రాజేందర్‌ను వెనకుండి నడిపించానని గుర్తుచేశారు.
ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లు పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి చేసిన తాజా వ్యాఖ్యలతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఇక హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో శనివారం ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రచారం నిర్వహించారు. ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఇంటింటా ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మామిండ్లవాడలో ఓ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థిస్తుండగా శ్రీనివాస్ అనే వ్యక్తి జమునను నిలదీశారు. తన కుమారుడు ప్రమాదంలో మృతి చెందగా, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని, ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment