
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు చినికిచినికి గాలివానలా మారుతోంది. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కరువై పార్టీ డివిజన్, బస్తీ కమిటీల ఎంపిక ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. అధినేత కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కమిటీల ఏర్పాటు సెప్టెంబరు 30లోగా పూర్తికావాలి. కానీ మహానగరం పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం కొలిక్కిరాకపోవడం గమనార్హం.
ప్రధానంగా అంబర్‌పేట్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ కార్పొరేటర్లు, ప్రస్తుత కార్పొరేటర్ల మధ్య విబేధాలు భగ్గుమనడం సంచలనం సృష్టిస్తోంది. సీనియర్ నేతల అభిప్రాయాలను పక్కనపెట్టి తాజాగా ఎమ్మెల్యే ఏకపక్షంగా డివిజన్ అధ్యక్షులను ప్రకటించడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు సుస్పష్టమౌతోంది.
► ఇక ముషీరాబాద్, ఖైరతాబాద్, ఎల్‌బీనగర్, గోషామహల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల ఏర్పాటుపై నేతల మధ్య ఏకాభిప్రాయం కరువైంది. పలు నియోజకవర్గాల పరిధిలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై కొందరు సీనియర్ నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
► కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను నగర మంత్రులు తీసుకుంటే తప్ప విబేధాలు పరిష్కారం కావన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరికొన్ని చోట్ల పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ జోక్యంతోనే విభేదాలు సద్దుమణిగే సూచనలు కనిపిస్తుండడం గమనార్హం.
► కాగా పలు నియోజకవర్గాల్లో ఈ నెలాఖరువరకైనా కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్‌గా మారింది.
దసరాకు కొత్త అధ్యక్షుడు..?
విజయదశమి రోజున గ్రేటర్ టీఆర్‌ఎస్‌కు నూతన సారథిని ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్ష రేసులో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ప్రధానంగా మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్‌యాదవ్, గ్రేటర్ పార్టీ మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ పేర్లు తాజాగా తెరమీదకు వచ్చాయి. వీరిద్దరు కాకుండా ఇతర సీనియర్ నేతల అభ్యర్థిత్వాలను సైతం అధినేత కేసీఆర్, కేటీఆర్‌లు పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అధ్యక్ష ఎంపిక విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయమే తమకు శిరోధార్యమని పలువురు నేతలు స్పష్టంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment