సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ఆవిర్భవించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభించారు. దీనిలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. నాయకుడంటే ప్రజలతో మమేకమై నడవాలని, తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్‌ఆర్ అని వ్యాఖ్యానించారు.
వైఎస్‌ఆర్‌కు ఎవరిపైనా వివక్ష లేదన్నారు. తన బిడ్డ షర్మిలను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్ కోసమే షర్మిల వస్తోందని భరోసా ఇచ్చారు. వైఎస్‌ఆర్ ఆశయ సాధనకే షర్మిల పార్టీ పని చేస్తుందని, ఈ క్రమంలో షర్మిల చేయికి.. ప్రజల చేయి ఊతం కావాలని తాను కోరుకుంటున్నట్లు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. పార్టీ జెండా అవిష్కరణ అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ నాయకత్వాన్ని నిలబెడతానని, తెలంగాణలో వైఎస్‌ఆర్ పాలన తీసుకొస్తానన్నారు. నాన్న మాట ఇస్తే.. బంగారు మూట ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత మన వైఎస్‌ఆర్ అని కొనియాడారు. ఐదేళ్ల వైఎస్‌ఆర్ పాలనలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు.. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించారన్నారు.
సీఎం కేసీఆర్ అధికారం ఉండగానే ఫాంహౌస్‌ను చక్కబెట్టుకుంటున్నారని, మాటల గారడీతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే పేదలకు భరోసా కలిగేది.. తరాలు మారుతున్నాయి.. కానీ ప్రజల తలరాతలు మారడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం అంటే ఉపాధి కల్పించడమని, ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉపఎన్నికలొచ్చినప్పుడే ఉద్యోగాల భర్తీని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. స్వయం సమృద్ధి గ్రామాలను తయారు చేయడమే మా లక్ష్యమన్నారు. వైఎస్‌ఆర్ టీపీలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుపుతూ.. చట్టసభల్లో సగం సీట్లు మహిళలకే కేటాయిస్తామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తామని హామి ఇచ్చారు. దళితులకు, ఎస్టీలకు భూమి ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందిని సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment