రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచాం: జగదీశ్‌రెడ్డి
రైతులకు, ఇతర అన్నివర్గాలకూ 24 గంటల విద్యుత్ ఇచ్చాం
విద్యుత్ కొరతను తీర్చేందుకే కొనుగోళ్లు చేశాం
వ్యవస్థల బలోపేతం కోసమే అప్పులు అయ్యాయి
ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగితే మతలబు ఏముంటుంది?
పక్క రాష్ట్రంలో మీ బాస్ చేస్తే తప్పు కాదా?
కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతమైందని.. కేసీఆర్ ముందు చూపు కారణంగానే అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సభ్యుడు జి.జగదీశ్‌రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో తీవ్రంగా ఉన్న విద్యుత్ కొరతను తీర్చేందుకే కొనుగోళ్లు చేశామని.. కొత్త ప్లాంట్ల ఏర్పాటును చేపట్టామని వివరించారు. కానీ కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.
సోమవారం జగదీశ్‌రెడ్డి శాసనసభలో ‘విద్యుత్’పద్దుపై బీఆర్‌ఎస్ తరఫున మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీలేరు ప్రాజెక్టును కొట్టేయడానికే ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను చంద్రబాబు కుట్రపూరితంగా తీసుకున్నాడు. మనకు ఇవ్వాల్సిన విద్యుత్ వాటా ఇవ్వకపోగా.. మేం కొనుగోలు చేద్దామనుకున్నా ఇవ్వకుండా ప్రైవేటు ప్లాంట్ల వాళ్లను బెదిరించాడు. ఆ పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం.
బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకుంటే.. ఏదో జరిగిందని ప్రచారం చేయడం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వొచ్చు. అదే సమయంలో ఏపీలో నాటి చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని బీహెచ్‌ఈఎల్‌కు నామినేషన్ పైనే ఇచి్చంది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు కోసం మేం ఇచ్చింది యూనిట్‌కు రూ.3.90 మాత్ర మే. ఇప్పుడు ఎనీ్టపీసీ నుంచి రూ.5.70 చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు కూడా నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్టులు ఇస్తే మేం మద్దతిస్తాం. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల్లో ఏదో వెదుకుతామని చూడటం. పక్క రాష్ట్రంలో తమ బాస్ చేస్తే మాత్రం కరెక్ట్ అనడం ఏమిటి?
మా హయాంలోనే విద్యుత్ వ్యవస్థ బలోపేతం
మేం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం పెంచాం. 400 కేవీ, 220కేవీ, 132 కేవీ, 33 కేవీ సబ్‌స్టేషన్లు పెరిగాయి. విద్యుత్ ట్రాన్స్‌మిషన్, పంపిణీ లైన్లు పెరిగాయి. సౌర విద్యుత్ పెరిగింది. డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేయడానికి ఉదయ్ పథకంలో చేరాలని కేంద్రం కోరితేనే చేరాం. బిల్లులు వసూలుకాని ప్రాంతాల్లోని సమీప విద్యుత్ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాం. ఉదయ్ పథకం కింద రూ.9 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై వేసుకున్నాం. తల తెగిపడినా రైతులకు మీటర్లు పెట్టనివ్వలేదు.
అప్పుల వాదన అర్థరహితం..
మా హయాంలో అప్పులు అయ్యాయనే వాదన అర్థరహితం. మేం అధికారంలోకి వచ్చేప్పటికే విద్యుత్ రంగంపై రూ.24 వేల కోట్ల అప్పులున్నాయి. అయినా రైతులు, అన్నివర్గాల ప్రయోజనం కోసమే విద్యుత్ రంగాన్ని అప్పులు చేసి అయినా బలోపేతం చేశాం. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది.
అదానీకి ఇవ్వాలనేదే మీ ఆలోచన
విద్యుత్ పనులు బీహెచ్‌ఈఎల్‌కు వద్దని, అదానీకే ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ఓల్డ్‌సిటీలో విద్యుత్ సరఫరా బాధ్యతను అదానీకి అప్పగించే అంశంపై ఎంఐఎం సభ్యులు ప్రశ్నించినప్పుడు.. కాంగ్రెస్ సర్కారు తేలుకుట్టిన దొంగల్లా గమ్మున ఉండిపోయారు. సబ్ కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకోవాలో మీకు తెలిసిన విద్య. మా చుట్టాలెవరూ కాంట్రాక్టు పనులు చేయలేదు. మంత్రివర్గంలో, వారి చుట్టాల్లో ఎందరో కాంట్రాక్టర్‌లు ఉన్నారు.
తప్పుదారి పట్టించే ప్రయత్నాలు..
సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అంటూ ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం తెచి్చన మెమో ప్రకారం.. సోలార్ విద్యుదుత్పత్తి జరిగేప్పుడు సూపర్ క్రిటికల్ ప్లాంట్లు సైతం ఉత్పత్తిని 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానితో సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోతుంది. ఎన్జీటీ కేసులు, కరోనాతోనే యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైంది. వెనుకబడ్డ నల్లగొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే యాదాద్రి ప్లాంట్ చేపట్టాం.
కానీ కొందరు నల్లగొండ జిల్లా నేతలు జిల్లాలో ప్లాంట్ వద్దని మాట్లాడారు. వారి సంగతిని ప్రజలే చూసుకుంటారు. విద్యుత్ సరఫరా సమస్యలపై హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలుకు çపంపుతున్నారు. వారి ఇళ్లకు లైన్‌మెన్లు పోయి సోషల్ మీడియాలో పోస్టులు తీసేయాలని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టుపెట్టిన మహిళా జర్నలిస్టు రేవతిపై కేసు పెట్టారు..’’అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
ముందే మాట్లాడుకుని జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్!
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి భూకబ్జాదారుడంటూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్ ఆందోళన చేశారని.. అలాంటి వ్యక్తిని విచారణ కమిషన్ చైర్మన్‌గా ఎలా నియమించారని జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని.. కమిషన్ చైర్మన్ వ్యక్తిగత విషయాలను, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలను సభలో మాట్లాడరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు సీఎం ఈ అంశంపై ఎలా మాట్లాడారని జగదీశ్‌రెడ్డి నిలదీశారు.
ప్రభుత్వం వేసింది న్యాయ విచారణ కాదని వ్యాఖ్యానించారు. ‘‘విద్యుత్ ఒప్పందాలపై విచారణ మొత్తం పూర్తయిందని.. జరిగిన నష్టాన్ని అంచనా వేయడమే మిగిలిందని జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుకునే కమిషన్ వేసినట్టు మాకు అర్థమైంది. ఈ అంశంలో కేసీఆర్ వాదన కరెక్ట్ అని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా మీరు తప్పుదోవపట్టిస్తున్నారా?’’అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment