Janasena Chief Pawan Kalyan Backstage Politics - Sakshi
Sakshi News home page

బీజేపీకి పవన్‌ కల్యాణ్‌ వెన్నుపోటు పొడుస్తారా? అదే జరిగితే బాబు లబలబ దేనికి?

Published Mon, Nov 28 2022 10:50 AM | Last Updated on Mon, Nov 28 2022 3:39 PM

Janasena Chief Pawan Kalyan Backstage Politics - Sakshi

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ బీజేపీకి వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడుతున్నారా? అన్న సందేహం ఆయన ఇటీవల చేస్తోన్న వ్యాఖ్యలతో వస్తోంది. ఆయన మెల్లగా మళ్లీ తన మనసులో మాట చెబుతున్నట్లుగా ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయను, ఇది నా నేల, నా రాష్ట్రం, ఇక్కడే తేల్చుకుంటా. మా యుద్దాలకు బీజేపీ మద్దతు అడగను, నేనే యుద్ధం చేస్తా.. అంటూ ఆయన చేసిన ప్రసంగంపై కొంత దృష్టి పెట్టాల్సిందే.

విశాఖలో ప్రధానమంత్రి మోదీతో జరిగిన చర్చల సారాంశం ఇంతవరకు పవన్‌ వెల్లడించలేదు. ఆయన  ఆ రోజు ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత డల్‌గా పెట్టిన ముఖ కవళికలను బట్టి అంతా అనుకున్నదేమిటంటే పవన్ కల్యాణ్ వేసిన ఎత్తు పారలేదని, టీడీపీతో కలిసి పోటీ చేయాలని బీజేపీని ఒప్పించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని భావించారు. ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.

వైసీపీని దెబ్బకొట్టడానికి ప్రధానికి చెప్పి చేయం అని చెప్పడం ద్వారా తమకు సొంత ఆలోచనలు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లయింది. పైగా ఆయన చేసే యుద్ధానికి బీజేపీ మద్దతు అడగరట. తానే యుద్ధం చేస్తారట. నిజంగానే ఆయనకు అంత బలం ఉందా? టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇలా బీజేపీని బెదిరిస్తున్నారా?

ఎటుపోయింది రోడ్‌ మ్యాప్‌.?
బీజేపీకి వెన్నుపోటు అన్న విషయం గురించి ఎందుకు ఇంతగా చర్చించుకోవాలంటే 2019 ఎన్నికలలో పవన్‌ కల్యాణ్‌ వామపక్షాలు, బీఎస్పీలతో కూటమి కట్టి ఘోర పరాజయం చవిచూశాక, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడుకుని మరీ ఆ పార్టీతో జతకట్టారు. బీజేపీ నేతలు కూడా ఒకటి, రెండు రోజులు వెయిట్ చేయించి, తదుపరి తమ అంగీకారం తెలిపారు. ఆ తర్వాత బీజేపీ వారిని రోడ్ మ్యాప్ అడుగుతున్నట్లు పవన్ కల్యాణే స్వయంగా చెప్పారు. ఆ రోడ్ మాప్ ఏమైందో తెలియదు.

తాజాగా బీజేపీ మద్దతు అడగను అని అనడం ద్వారా అవసరమైతే ఆ పార్టీ పొత్తు నుంచి తప్పుకుంటానని పవన్ బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తమను దారుణంగా అవమానించిన తెలుగుదేశంతో జత కలిసే ప్రసక్తి లేదని మోదీ స్పష్టం చేయడంతో ఏమి చేయాలో తెలియక కొన్నాళ్ల పాటు పవన్ మౌనం దాల్చారు. కానీ ఇప్పుడు తన సహజ శైలికి అనుగుణంగా మళ్లీ మాట మార్చినట్లు కనిపిస్తుంది.

ఇప్పటివరకు చెప్పిన డైలాగ్‌లు ఏమయ్యాయి?
గతంలో కాపుల గురించి కాని, అమరావతి రాజధాని గురించి కాని, ఇలా అనేక అంశాలలో ఆయన ఎక్కడ ఏ మాట అవసరమైతే అది మాట్లాడి నిలకడలేని వ్యక్తిగా ప్రజల దృష్టిలో చులకన అయ్యారు. అంతదాకా ఎందుకు! తనకు పరిటాల రవి గుండు కొట్టించినట్లు టీడీపీ ఆఫీస్ నుంచే ప్రచారం చేశారని బాధపడ్డ ఆయన అదే పార్టీతో కలవడానికి ఏ రకంగాను ఫీల్ కాలేదు. ఓట్లు చీలనివ్వకూడదంటూ టీడీపీ, బీజేపీలతో కలిసి ఒక ఆప్షన్‌ను ప్రకటించిన పవన్‌ కల్యాణ్, మోదీ సమావేశం తర్వాత తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అని అందరిని ఆశ్చర్యపరిచారు.

తాజాగా మళ్లీ ఓట్లు చీలనివ్వరాదని అంటున్నారు. తూర్పు కాపుల సమావేశంలో మాట్లాడుతూ ఒకవైపు వైసీపీని ఓడించాలని చెబుతూ మరో వైపు ఓట్లు చీలకుండా తనకు వేయండి అని ఒక మాట, లేదా మరో పార్టీకి వేయండి అని అనడం ద్వారా పరోక్షంగా టీడీపీకి వేయాలని కోరుతున్నట్లు అనిపించింది.

ఇంత అలవోకగా అబద్దాలా?
కొద్ది రోజుల క్రితం ప్రజాస్వామ్య రక్షణ వేదిక అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రకటన చేసిన పవన్ కల్యాణ్‌ దాని గురించి మాట్లాడడం లేదు. ఇప్పటం గ్రామంలో ప్రహరీ గోడలు కూల్చితే ఇళ్లు కూల్చారని ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకటికాదు. నిలకడ లేకపోవడమే కాదు.. అసత్యాలు చెప్పడానికి కూడా వెనుకాడడం లేదంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

2024 ఎన్నికలలో వైసీపీని గద్దె దించుతామని భీకర ప్రకటనలను గట్టిగా అరచి చెబితే జనం అంతా మారిపోతారా? ఆయనను నమ్ముతారా? వైసిపి భూస్వాముల గడపలను కూల్చుతారట. రౌడీసేన కాదు.. విప్లవ సేన అని ఆయన వైసిపికి జవాబు ఇవ్వడం వినడానికి బాగానే ఉన్నా, అసలు విప్లవం చేసేదెవ్వరు? ఆయన వెంట నిలిచేది ఎవ్వరు?

ఆ మాటలకు అర్థాలు వేరులే.!
2019 ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు కనీసం తను అయినా గెలవాలని తంటాలు పడుతున్నారు. అందుకోసం టీడీపీ స్నేహం ఏమైనా ఉపయోగపడుతుందా అన్న ఆలోచన ఆయనది. ఆ మాట పైకి చెప్పలేని నిస్సహాయ స్థితి. అందుకే సినిమా డైలాగులు చెప్పినట్లు విప్లవం అంటే వచ్చేస్తుందా? మరో వైపు ఆయన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కూడా తను ఎలాగైనా ఈసారి అసెంబ్లీకి రావాలని, అందుకు టీడీపీ సహకారం అవసరమని అటువైపు గుంజుతున్నారని చెబుతున్నారు.

విశేషం ఏమిటంటే జనసేనలో వీరిద్దరు నేతలు తప్ప, మరొకరి పేరే పెద్దగా వినిపించదు. ఎవరి ఫేస్ కనిపించదు. అలాంటి పార్టీ విప్లవం సృష్టిస్తుందట. వారాంతపు షూటింగ్ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి నాలుగు డైలాగులు అరచి చెబితే విప్లవం వచ్చేటట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతగా లబలబ కొట్టుకుంటున్నారు. తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని గెలిపించాలని జాలిగా ప్రజలను అడుగుతారు. ఆయనతో జతకట్టాలని ఉబలాటపడుతున్న పవన్ కల్యాణ్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేయకపోతే మరో సారి భంగపాటు తప్పకపోవచ్చు. 

బీజేపీ మద్ధతుండి ఇప్పటివరకు ఏం చేశాడని..?
ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, రాజకీయాలపై ఎంతటి ఏహ్యబావం ఏర్పడిందో ఆయన మాటల బట్టి అర్ధం అవుతుంది. అదే సమయంలో తన సోదరుడు పవన్ కల్యాణ్ రాజకీయాలు చేయగలరని, అనుకున్నది సాధిస్తారని అన్నారు. అందులో వాస్తవికత ఉందో, లేక ఏదో మాట వరసకు అన్నట్లుగా ఉందో తెలియదు. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆయనను ఆకర్షించే యత్నం చేస్తోందని వార్తలు వస్తుంటే, ఈయనేమో బీజేపీ మద్దతు అడగను అంటున్నారు. అంతిమంగా ఏమి చేస్తారో బహుశా ఆయనకే తెలియకపోవచ్చు. ఏది ఏమైనా పవన్ కల్యాణ్‌ మరీ దిగజారుడు రాజకీయాలు చేయకుండా ఉంటే కనీసం ఆ మాత్రం పరువైనా దక్కుతుందేమో!
హితైషి, పొలిటికల్‌ డెస్క్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement