
అనకాపల్లి వారాహి యాత్రలో పవన్
సాక్షి, అనకాపల్లి: ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కష్టమే.. గతంలో నేను స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రధానమంత్రిని కలిసేందుకు నాతో ఎవరొస్తారో చేతులెత్తండి అని అడిగితే ఎవరూ స్పందించలేదు’’.. అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నుంచి తనకు మద్దతు రాలేదని, లేదంటే ప్రధాని దగ్గరకు వెళ్లి ప్రైవేటీకరణను నిలిపివేసే వాడినని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదిని ఊరికే నిందిస్తే సరికాదని స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులను పవన్ తప్పుబట్టారు.
అనకాపల్లిలో ఆదివారం నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఓడిపోయానని, ఇప్పుడు పిఠాపురంలో గెలవాలని బలంగా కోరుకుంటున్నానన్నారు. అనకాపల్లిలో ఉన్న శారదానది విదేశాల్లో ఉండి ఉంటే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేదని, మా కూటమి గెలిస్తే దాని ఒడ్డును పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మరోవైపు.. దారి పొడువునా సీఎం జిందాబాద్ అంటుంటే ‘మనకు అంత శక్తిలేదు.. 2029లో సీఎం అవడానికి ప్రయత్నిస్తా’నని పవన్ అన్నారు.