ఏపీలో నేటి రాజకీయ పరిణామాలతో.. టీడీపీకి జనసేన బినామీ పార్టీగా తేటతెల్లమైంది. మళ్లీ కొత్తగా.. కలిసి పోటీ చేస్తాం.. కలిసి వస్తాం అంటూ పవన్ ప్రకటించడం హాస్యాస్పదం కాగా, దానికి ప్రస్తుతం టీడీపీ వ్యవహారాలను చూస్తున్న నందమూరి బాలకృష్ణ స్వాగతించడం వెరసి.. ఇద్దరి ముఖంలోనూ ఆనందం కనిపించింది. పొత్తు రాజకీయానికి సెంట్రల్ జైలు సైతం ఒక వేదిక కాగలదనే కొత్త విషయాన్ని ఏపీ ప్రజలకు తెలియజెప్పింది. ఈ క్రమంలో కలిసి నడవడం సంగతి సరే.. అసలు ఆ పార్టీల క్యాడర్‌లు మున్ముందు సహకరించుకుంటాయా? అనే ప్రశ్న ప్రధానంగా తలెత్తుతోంది.
రాజమండ్రిలో ఇవాళ బాలయ్య హుషారుగా.. బిజీ బిజీగా గడిపారు. పార్టీ పగ్గాలు తన చేతులో ఉన్నాయనే ఆనందం ఆయన కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఒకవైపు సోదరి భువనేశ్వరి, అల్లుడు నారా లోకేష్, కూతురు బ్రహ్మణిలతో చర్చలు జరిపి.. ఆ వెంటనే పవన్‌తో కలిసి చంద్రబాబు ఉన్న జైలుకు ములాఖత్‌కు వెళ్లారు. పవన్ పొత్తు ప్రకటన తర్వాత.. టీడీపీ ముఖ్యనేతలతో కలిసి బాలకృష్ణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 19వ తేదీన చంద్రబాబు పిటిషన్‌ల దాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి కార్యాచరణ రూపొందించుకుందామని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. గత దఫా భేటీల కంటే మరింత యాక్టివ్‌గా కనిపించడం గమనార్హం.
అయితే.. పవన్‌తో జరిగిన చర్చల ప్రస్తావన ప్రధానంగా ఆ భేటీలో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనతో పొత్తుకు వెళ్తే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల ప్రస్తావనే ఆ భేటీలో ప్రముఖంగా వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ గ్యాప్ సంగతేంటి?
టీడీపీ-జనసేన పొత్తు.. ఇప్పుడు గ్రౌండ్ లెవల్‌లో సమస్యలు తీసుకురావడం ఖాయమనే అభిప్రాయాన్ని కొందరు నేతలు బాలయ్య వద్ద ప్రస్తావించారు. ఇరు పార్టీల క్యాడర్‌లు అసలు సహకరించుకుంటాయా? విబేధించుకుంటాయా? అనే అనుమానాలు లేవనెత్తారు. పైగా జనసేనకు సీట్ల కేటాయింపు కొత్త సమస్య సృష్టిస్తుందని.. ప్రత్యేకించి కొందరికి టికెట్ గనుక ఇవ్వకుంటే అసంతృప్తి తారాస్థాయిలో రాజుకుంటుందని బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే డిసైడెడ్ నియోజకవర్గాల విషయంలో ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారవచ్చని కూడా చెప్పినట్లు సమాచారం. చంద్రబాబులా మేనేజ్ చేయగలిగితేనే.. జనసేనతో కలిసి ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయని మరికొందరు బాలయ్య వద్ద ఓపెన్‌గా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికప్పుడు సమస్యను పరిష్కరించుకున్నా.. ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత గందరగోళానికి దారి తీయొచ్చనే అభిప్రాయమూ పలువురు వ్యక్తం చేశారు.
ఈ ఛాన్స్ కోసమే పవన్ ఎదురు చూపులు
వాస్తవానికి టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కొత్తగా ప్రకటన చేయడం వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఎప్పుడో సీట్ల పంపకం కూడా జరిగిపోయినట్లు ఆ మధ్య కొన్ని విశ్లేషణాత్మక కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ కథనాల అంచనాకి తగ్గట్లే బాబు-పవన్ మధ్య ఒప్పందం కుదిరినట్లు భోగట్టా. జనసేన తరపున సీఎం కావాలనే కార్యకర్తల కలను.. కలగానే ఉండనివ్వాలని పవన్ భావిస్తున్నారు. అందుకే పాతిక లోపు అసెంబ్లీ స్థానాలు.. రెండు నుంచి మూడు లోక్‌సభ స్థానాలను టీడీపీ ఆఫర్ చేస్తే సంతోషంగా అంగీకరించాడు. వాస్తవానికి.. పవన్ కూడా ఈ అవకాశం కోసమే ఇంతకాలం ఎదురు చూశాడేమో అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అందుకే చంద్రబాబును జైల్లో ములాఖత్ అయిన వంకతో పొత్తుపై ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది.
జనసైనికులు అంత రోషం లేనివాళ్లా?
పవన్ కల్యాణ్ సభలకు వెళ్లే వారంతా అలగా జనం అని బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటుంది. అంతెందుకు పవన్ సైతం ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు కూడా. ఈ పరిణామంపై జనసైనికులు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. సోషల్ మీడియాలోనూ బాలయ్యను టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు. ఆపై.. బాలయ్య హోస్ట్‌గా చేసిన ఓ షోలో పవన్ కనిపించినప్పుడు.. ఆ వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చి అసహనం వ్యక్తం చేశారు. తాము అంత రోషం లేని వాళ్లలాగా కనిపిస్తున్నామా? అసలు షో వెళ్లాల్సిన అవసరం ఏంటని? పవన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.
వాస్తవానికి బాలయ్య ‘అలగా జనం వ్యాఖ్యల’పై పవన్ అభిమానుల కోపం ఇంకా చల్లారలేదు. అందుకే .. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించాక టీడీపీ ఇచ్చిన బంద్‌కు పవన్ మద్దతు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో జనసైనికులు కనిపించిన దాఖలాలు లేవు. ఇక.. తాజా పొత్తు ప్రకటనపైనా జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కేవలం వైఎస్ జగన్‌ను మళ్లీ అధికారంలోకి రానివ్వొద్దనే ఉద్దేశం.. అంతకు మించి అవినీతి కేసులో అరెస్ట్ అయినప్పటికీ బాబుకు మద్దతు ఇవ్వడమే తప్ప.. సీరియస్ పాలిటిక్స్ తమ అధినేతలో కనిపించడం లేదన్న కామెంట్లు ఇప్పుడు జనసైనికులే చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment