
సాక్షి, అమరావతి: కుట్ర రాజకీయాల్లో భాగంగానే పవన్‌కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో ప్రభుత్వంపై పిచ్చి కూతలు కూస్తున్నాడని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీకెండ్‌లో ప్యాకేజీ స్టార్ వచ్చి నాలుగు సినిమా డైలాగులు చెప్పి.. కథలు అల్లి రాజకీయాలు చేసుకునే వ్యక్తి రక్తాలు చిందిస్తాం అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పార్ట్–1 రెక్కీ, పార్ట్–2 రాయి, పార్ట్–3 ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతతో మూడ్రోజులుగా సీరియల్ డ్రామా నడిపిస్తున్నారన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఇప్పటం గ్రామంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు. అక్కడ రోడ్డు విస్తరణ పనులతో తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
జనవరిలో విస్తరణలకు మార్కింగ్ ఇస్తే, ఏప్రిల్–మే నెలల్లోనే మొదటి విడత పనులు ప్రారంభమయ్యాయి. కానీ, తన సభకు స్థలం ఇచ్చారనే కక్షతో ప్రభుత్వం ఇళ్లు కూల్చేసినట్లు పవన్ ఆరోపిస్తుంటే, సిగ్గులేకుండా తానా తందానా అంటూ చంద్రబాబు చెత్త ట్వీట్లు పెడుతున్నాడు. అలాగే, ఇప్పటంలో టీడీపీ, జనసేన పార్టీ వాళ్ల ఇళ్లు కూల్చేశారంటూ పచ్చ పత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాశారు. కళ్లుండి చూడలేని రామోజీరావు హైదరాబాద్‌లో కూర్చుని నిత్యం సీఎం జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. రామోజీ ఇప్పటం వచ్చిచూస్తే వాస్తవాలు తెలుస్తాయి.
కూల్చివేతలకు కేరాఫ్ చంద్రబాబు
కూల్చివేతలపై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఆయన హయాంలో పుష్కరాల పేరుతో అనేక ఇళ్లను, గుళ్లను కూల్చేశారు. ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి కూలగొట్టించి.. బుడమేరు కాల్వలో పడేశారు. మేం అధికారంలోకి వచ్చాక గాంధీ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాం. అలాగే, ఇప్పటంలో గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది.
వాటిని పంచాయతీ కార్యాలయంలో భద్రంగా ఉంచాం. త్వరలోనే మళ్లీ ప్రతిష్టిస్తాం. ఆక్రమణల తొలగింపులో భాగంగా రాజశేఖర రెడ్డిగారి విగ్రహం దిమ్మెను కూడా పగులగొట్టారు. ఇక ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానందని’ ఇడుపులపాయపై హైవే వేస్తామంటూ పిచ్చి కళ్యాణ్ ప్రేలాపనలు చేస్తున్నాడు. గతంలో ఇప్పటంలో సభ పెట్టి గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని కోతలు కోశాడు. ముందు వాటిని ఇచ్చి చూపించాలి.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం
ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే పవన్ పనిగా పెట్టుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదు. రూ.250 కోట్ల సుపారీ ఇచ్చి తనపై రెక్కీ నిర్వహించారని చెప్పడం.. రెండ్రోజులు డ్రామా నడపడం సిగ్గుచేటు. రెక్కీపై తెలంగాణ పోలీసులు వాస్తవాలు చెబితే.. వీళ్ల దిమ్మతిరిగింది. పవన్ నీ జోలికి ఎవడు వస్తాడు? నీకు నష్టం చేస్తే తద్వారా లబ్ధిపొందేది ఒక్క చంద్రబాబే. రెక్కీలు, సుపారీలు చేస్తే ఆయనే చేయాలి.
జగన్ సర్కార్‌ను ఇంచు కూడా కదల్చలేరు..
కుప్పకూలిపోయిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ కలలు కంటున్నారు. వీరిద్దరికీ ఒక్కటే చెబుతున్నా.. మా నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదల్చలేరు.
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మీరు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, వీధి నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకి దమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ ఒంటరిగా పోటీచేసి ముఖ్యమంత్రి అవుతానని చెప్పాలి. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్, భీమవరం, గాజువాకల్లో ఎక్కడ పోటీచేస్తే అక్కడ పవన్ ఓటమి ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment