సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న 111 (జనసేన 8 సీట్లు కలిపితే 119) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత వాస్తవ పరిస్థితి, అభ్యర్థుల విజయావకాశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సమీక్షించారు. చివరి రెండు రోజుల ప్రచారం ఎంతో కీలకమని, ఉధృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు పోల్ మేనేజ్ మెంట్‌పై దృష్టి పెట్టాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పోల్ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చూడాలని పార్టీ నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఇందుకు రాష్ట్ర పార్టీకి జాతీయనాయకత్వం చేదోడువాదోడుగా నిలుస్తుందని నడ్డా భరోసానిచ్చినట్టు చెబుతున్నారు. ఆదివారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన నడ్డా, తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన విధుల్లో నిమగ్నమైన జాతీయనేతలు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, సంస్థాగత సహ ఇన్‌చార్జి శివప్రకాష్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌తో సమావేశమయ్యారు.
ఇప్పటి వరకు పనిచేసింది ఒక ఎత్తు.. చివరి రోజుల్లో పార్టీకి ప్రజల్లో పెరిగిన మద్దతును ఓట్ల రూపంలో పోలింగ్‌బూత్‌ల దాకా తీసుకెళ్లి విజయం సాధించడం మరొక ఎత్తు అని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాలు నిర్వహించిన తర్వాత పరిస్థితిలో అనూహ్యంగా మార్పు వచ్చిందని, అభ్యర్థుల విజయావకాశాలు చాలా సీట్లలో మెరుగయ్యాయని వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు.
ఆ సీట్లపై పూర్తిస్థాయిలో ఫోకస్
45–50 స్థానాల్లో అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారని, వీటిలో అత్యధిక సీట్లను గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో బీజేపీ సత్తా చాటాల్సి ఉంటుందని నడ్డా పేర్కొన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలలో పరిస్థితి ఏమిటి అని నడ్డా ప్రశ్నించినపుడు ఆ రెండుచోట్లా కేసీఆర్‌కు బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని, గెలిచే అవకాశాలూ ఉన్నాయని ప్రకాష్‌జవదేకర్, సునీల్‌బన్సల్ వెలిబుచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment