సాక్షి, హైదరాబాద్: పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ఉందని తెలిపారు. దొరలగడీ నుంచి బయటపడ్డానని, ఇంత అరాచకం ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. కాగా జూపల్లి కృష్ణారావుపై బీఆర్‌ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరనే నేపథ్యంలో జూపల్లిని సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ అధిష్టానం సోమవారం వెల్లడించింది.
ఈ క్రమంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాట్లాడేందుకు జూపల్లి ప్రయత్నించగా.. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ప్రెస్‌మీట్ పెట్టేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ మాట్లాడతానంటూ జూపల్లి మైక్‌ల ముందుకొచ్చారు.
మీడియాతో మాట్లాడుతూ.. బీర్‌ఎస్ పార్టీ రెండు, మూడేళ్లుగా సభ్యత్వం నమోదు చేసే బుక్స్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నట్లా? లేదా అనే అనుమానం ఉండేదన్నారు. బీఆర్‌ఎస్ బండారం బయటపడుతుందని భయపడి తనను సస్పెండ్ చేశారని ఆయన దుయ్యబట్టారు.
‘తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశాను. వెయ్యి కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరని చెప్పాను. ఎందుకు సస్పెండ్ చేశారో కేసీఆర్ చెప్పాలి. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేది. సీఎం అంటే ధర్మకర్తగా పారదర్శక పాలన అందించాల్సిన బాధ్యత ఉంది. నాకు నచ్చిన్నట్లు పాలన చేస్తా అడగటానికి మీరెవరు అన్నట్లు కేసీఆర్ ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
చదవండి: ఖమ్మంవైపు తెలంగాణ రాజకీయాలు.. త్వరలో కొత్త పార్టీ?
Comments
Please login to add a commentAdd a comment