ఆంధ్రప్రదేశ్‌లో పచ్చ పార్టీ తెలంగాణ కాంగ్రెస్‌లా తయారవుతోంది. ఓ జిల్లాలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అంటూ వార్ జరుగుతోంది. ఓ సీనియర్ నేత తనయుడు ఒకానొక పార్లమెంటరీ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్లకు నచ్చడంలేదని టాక్. జూనియర్లను ప్రోత్సహించడం అసలు సహించలేకపోతున్నారట. అందుకే ఆ నాయకుడు తమకొద్దని పార్టీ చీఫ్‌కు తేల్చి చెప్పేశారట.
కాకినాడ టీడీపీలో రగులుకున్న మంటలు పక్క జిల్లాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తనయుడుగా.. మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా నవీన్ సుపరిచితం. ఇటీవల కాలంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నవీన్ అనుసరిస్తున్న విధానాలు కొందరు సీనీయర్ నేతలకు మింగుడు పడడం లేదని టాక్.
ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణీ నేతలను నవీన్ ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. అలా ప్రోత్సహించిన నేతలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారట. దీంతో నవీన్ నాయకత్వం తమకు వద్దని మరో నేతను నియమించాలంటూ కొందరు తమ బాస్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
సైకిల్ ఎక్కేది నేనే.!
గతంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో నవీన్ రెండు నెలల పాటు పాదయాత్ర చేశారు. తొలుత ఈ పాదయాత్రకు యనమలతో పాటుగా పలువురు సీనియర్లు.. మాజీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆ తరువాత నవీన్ ముఖం చూడడమే మానేశారట. అంతేకాదు గత నెలలో పాదయాత్ర ముగింపు సందర్భంగా నవీన్‌ను కలవడానికి ఒక్క నేత కూడా రాలేదని సమాచారం. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవీన్ నిర్వహించిన యాత్ర తుస్సు మన్నట్లు అయిందని పార్టీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్ధినని నవీన్ తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం యనమల రామకృష్ణుడు.. నిమ్మకాయల చినరాజప్ప వంటి సీనియర్లుకు రుచించడం లేదని టాక్. తండ్రి జగ్గంపేట నుండి ఎమ్మెల్యేగా.. కొడుకు కాకినాడ పార్లమెంట్ సీటుకు ఎలా పోటీ చేస్తారంటూ ప్రశ్నించుకుంటున్నారట. ఒకే ఇంట్లో ఇద్దరికి సీట్లు ఎలా ఇస్తారని చర్చించుకుంటున్నారట.
మొత్తం మీద జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కాకినాడ జిల్లా పార్టీలో మంటలు రేపారు. ఒక వైపు జూనియర్లను ప్రోత్సహిస్తూ సీనియర్లకు కంటగింపుగా మారారు. మరోవైపు తండ్రీ, కొడుకులిద్దరూ పోటీ చేస్తున్నారనే సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా అసమ్మతిని పెంచి పోషిస్తున్నారు. చూడాలి చివరకు ఏమవుతుందో..?
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment