రాంచీ: జార్ఖండ్‌లోని 43 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న(రేపు) తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముగించేశాయి. తాజాగా.. సీఎం హేమంత్ సోరెన్ సతీమణి, జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు ఆరోపణలు చేశారు. తన ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిందని, దీంతో ఫోన్‌లోనే తాను సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు.
పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా జగన్నాథ్‌పూర్ నియోజకవర్గంలోని మౌలానగర్ మైదానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫోన్ ద్వారా ఆమె ప్రసంగిస్తూ..
జార్ఖండ్‌లో జేఎంఎం మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లను వినియోగించకుండా ఎన్నికల సంఘం అడ్డుకున్నదని ఆమె ఆరోపించారు. బీజేపీని టార్గెట్ చేసిన ఆమె ఆడపిల్లలు చదువుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనేది బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో పాఠశాలలను మూసేయడానికి ఇదే కారణమని ఆరోపించారు.
బీజేపీ పార్టీ ధనవంతులు, వ్యాపారుల పార్టీ అని కల్పన కల్పనా సోరెన్ అభివర్ణించారు. గిరిజనం అనే పదాన్ని బీజేపీ ద్వేషిస్తుందని, వారి సంస్కృతిని, గుర్తింపును నాశనం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆమె ఆరోపించారు. ఆదివాసీ తెగ 'సర్నా కోడ్'ను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని ఆమె ప్రశ్నించారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి సోనారామ్ సింకుకు ఓటు వేయాలని కల్పనా సోరెన్ విజ్ఞప్తి చేశారు.
అయితే కల్పనా సోరెన్ చేసిన ఆరోపణలపై జార్ఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ స్పందిస్తూ ఒడిశా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాల కదలిక కారణంగా కల్పనా సోరెన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గంటపాటు ఘట్‌సిలా వద్ద నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఉదంతంలో ఓ అధికారిని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో
Comments
Please login to add a commentAdd a comment