న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన దురుసు వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఈ చట్టాలు తిరిగి అమలు చేసేందుకు రైతులే డిమాండ్ చెయ్యాలని తెలిపారు.
ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గం మండిలో ఆమె మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తిరిగి తీసుకురావాలని కోరారు. ‘ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. కానీ మూడు వ్యవసాయ చట్టాలు తిరిగి అమలు చేయాలి. ఇందుకు రైతులు స్వయంగా డిమాండ్ చేయాలి.
ఈ చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల నిరసనల కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేశాభివృద్ధిలో రైతులే మూల స్థంభం. వారి ప్రయోజనాల కోసం చట్టాలను తిరిగి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
అయితే కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ ఎప్పటికీ అది జరగనివ్వదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మాట్లాడుతూ.. ‘మూడు నల్ల రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ 750 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము దీనిని ఎప్పటికీ అనుమతించం’ అని పేర్కొన్నారు.
కాగా 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు 2020 నవంబరు 26 నుంచి నిరసనలు మొదలుపెట్టారు. ఆందోళనల్లో అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి.
ఎట్టకేలకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూ 2021 నవంబరు 19న దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. అనంతరం ఈ నేపథ్యంలో తమ నిరసనలను రైతులు నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment