సాక్షి, అమరావతి : వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కమిటీల నివేదికల ఆధారంగానే మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉండి కుట్ర రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. ఏపీలో అవాంఛనీయ ఘటనలు జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుబట్టడం సరికాదన్నారు. చంద్రబాబు తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. (చదవండి : 3 రాజధానులకు రాజముద్ర)
టీడీపీ హయంలో రాజధాని కడుతా అంటే ఎవరైనా చంద్రబాబును అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. ఐదేళ్లులో ప్రజలను మభ్య పెట్టడం తప్ప చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. రాజధాని అంశం కేంద్ర పరిధి కాదని, దానిపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని బీజేపీ స్పష్టం చేసిందన్నారు. సీబీఐ రావొద్దు.. కేంద్రానికి రాష్ట్రంలో ఏం పని అన్న చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. 2015 నుంచి 2019 వరకు అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అమరావతి రైతులకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. చంద్రబాబు ఆరాటమంతా సొంత ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. వ్యవస్థలను ప్రభావం చేయడంలో చంద్రబాబు మేధావి అని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలు రావాలని మంత్రి కన్నబాబు సవాల్ చేశారు.
(చదవండి : విశాఖపై పోలీసు శాఖ ఫోకస్)
Comments
Please login to add a commentAdd a comment