ప్రజారాజ్యంలా జనసేననూ నిర్విర్యం చేసే ప్రయత్నం
నాదెండ్లను అడ్డుపెట్టుకుని జనసేనను దెబ్బతీస్తారన్న అనుమానాలున్నాయి
24 సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి?
చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక బహిరంగ లేఖ
సాక్షి, అమరావతి: మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద పవన్ బొమ్మ పెట్టినా, పత్రికల్లో ప్రకటనలు (యాడ్స్)లో పవన్ ఫొటో వాడినా టీడీపీకి కాపు ఓట్లు రావని చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక కరాఖండిగా చెప్పింది. జనసేనకు జనబలం, ధనబలం లేదని పవన్‌తో ఎంత బలంగా చెప్పించినా నమ్మేందుకు జనం అంత అమాయకులు కాదని ఎద్దేవా చేసింది. నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిరీ్వర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోందని తెలిపింది. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్, కన్వీనర్లు పెద్దిరెడ్డి మహేష్, బోడపాటి పెదబాబు గురువారం మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ సారాంశమిదీ..
‘కాపు సామాజికవర్గానికి చంద్రబాబుకు ఉన్నంత చాణక్య తెలివితేటలు లేకపోవచ్చు గానీ, చైతన్యం మెండుగా ఉంది. చంద్రబాబు తీరుతో టీడీపీ, జనసేన కూటమి విజయావకాశాలను చేజేతులారా పాడుచేసుకున్నారు. జనసేన అండ లేకుండా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోరాటం చేయలేదు. కేవలం 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చి పవన్‌తో యుద్ధం చేయించి కాపు సామాజికవర్గాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలించదు.
2014లోనే జనసేనకు కనీసం 24 సీట్లు ఇచ్చినా పవన్‌కు ప్యాకేజీ స్టార్ అనే అప్రతిష్ట వచ్చేది కాదు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే మాటలను బాబు ఇప్పటివరకు ఖండించలేదు. 2014లో చతికిలపడిపోయిన టీడీపీని జనసేన, బీజేపీ నిలబెట్టాయి. బాబు సహజగుణానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనను వదిలేసి ఫలితాన్ని చవిచూశారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడుతున్న పవన్ రెండు చోట్లా తనను ఓడించారని పదే పదే ప్రజలను నిందించడం సరికాదు. పవన్ ఓటమిలో టీడీపీ పాత్ర, వ్యక్తిగత వైఫల్యం ఏమిటో ప్రజలకు తెలుసు.’
2019లో మీ స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు?
‘బుధవారంనాటి జెండా సభలో పవన్ మాట్లాడుతూ స్నేహమంటే చివరి వరకు అని స్వయంగా ప్రకటించారు. మరి 2019లో మీ ఇరువురి స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు చంద్రబాబూ? ఆ రోజు మీ డైరెక్షన్ మేరకే విడిగా పోటీ చేశారా? పవన్ ఓటమిలో మీ పాత్ర లేదా? ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని మీరు చేసిన ప్రయత్నం ఫలించిందా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు.
నాలుగున్నరేళ్లపాటు ఎన్‌డీఏ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుని, సడెన్‌గా యూటర్న్ తీసుకుని ప్రజాధనంతో కేంద్రంపై ఉద్యమాలు చేయించారు. ప్రధాని మోదీని తిట్టారు, తిట్టించారు. ఇపుడు బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్నారు. రాజమండ్రి జైలుకు వచ్చి పవన్ మీకు మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వాడుకుని పవన్‌ను మడత పెట్టేస్తే.. ఆయన అభిమానులు, కాపులు కలిసి మిమ్మల్ని మడత పెట్టేస్తారని గమనించండి.’
త్యాగాలు ఇతరులే చేయాలా? మీరు చేయరా?
‘24 ఎమ్మెల్యే సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి? 151 సీట్ల కోసం టీడీపీ వాళ్లే యుద్ధం చేసుకుంటార్లే అనే పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. పవన్‌ను లోక్‌సభకు పోటీ చేయించి ఢిల్లీ పంపేస్తారని, బాబుకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలవడానికి పవన్ ఇష్టపడినప్పటికీ ఆయన్ని అడ్డుకున్నది చంద్రబాబే అని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది.
నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిర్విర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోంది. ఇలా నమ్మించి మోసం చేయడాన్ని కాపులు ఏమాత్రం జీర్ణించుకోరన్న నగ్న సత్యాన్ని గత అనుభవాల దృష్ట్యా మీరు గ్రహించాల్సి ఉంది. త్యాగాలు చేయాలని తమరు ఇతరులకు చెప్పడమేనా? మీరు త్యాగాలు చేయరా? పవన్‌ను మోసం చేయడం ద్వారా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారనే నగ్న సత్యాన్ని గ్రహించాలి’ అని ఆ లేఖలో కాపు ఐక్య వేదిక నేతలు చంద్రబాబుకు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment