సాక్షి కరీంనగర్: జిల్లా బీజేపీలో కలకలం మొదలైంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న జిల్లాగా కరీంనగర్‌కు గుర్తింపు ఉంది. అదే గుర్తింపుతో 2019లో బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకవడం చకచకా జరిగాయి. అయితే.. అప్పటి నుంచి బండి సంజయ్ తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలను కలుపుకుపోవడం లేదని, కేడర్ బాగోగులు చూసుకోవడం లేదని సంజయ్‌పై గుర్రుగా ఉన్నారు. కనీసం పార్టీ అధికారిక కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వడంలేదని వాపోతున్నారు. బుధవారం నగరంలో సంజయ్ వ్యతిరేకవర్గమంతా సమావేశం కావడం చర్చనీయాంశమైంది. త్వరలోనే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెబుతోంది. సంజయ్ వర్గం మాత్రం అలాంటిదేమీ లేదని, తాము అందరితోనూ సఖ్యతగానే ఉంటున్నామని చెబుతోంది.
7 శాతం ఓట్లను 35 శాతానికి తెచ్చాం
ఈ క్రమంలో బండి సంజయ్ వర్గం మాత్రం పార్టీలో తమలో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెబుతోంది. బండి పార్టీ పగ్గాలు చేపట్టాక అందరినీ కలుపుకుని పోతున్నారు కాబట్టే మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఆయన అధ్యక్షుడు అయ్యాక జరిగిన మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రెండింటింలో పార్టీ విజయం సాధించడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 7 శాతంగా ఉన్న పార్టీ ఓటు బ్యాంకును 35 శాతానికి చేర్చిన విషయం విస్మరించకూడదని అంటున్నారు. దీన్ని 45 శాతానికి చేర్చడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం బండి వ్యూహమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సీనియర్ల అలకలు టీకప్పులో తుఫాను చల్లారిపోతాయని ధీమాగా ఉన్నారు.
చదవండి: వైరల్ వీడియో: ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఏడ్చేసిన బీఎస్పీ నాయకుడు
10 నెలల విభేదాలు.. తారాస్థాయికి
జిల్లా బీజేపీలో విభేదాలు ఈనాటివి కావు. సంజయ్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచే మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ఇవి తీవ్రతరం కావడంతో పూర్వపు జిల్లా సీనియర్ నేతలు దాదాపు 10 నెలల క్రితం ఇదే విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరుముగ్గురి వద్దా కరీంనగర్ వ్యవహారాన్ని వివరించినట్లు తెలిసింది. ఈలోపు పార్టీలోకి ఈటల రాజేందర్ చేరడంపైనా సీనియర్లు గుర్రుగానే ఉన్నారు.
►ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు ఈటల మద్దతు ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, అధిష్టానం, ఎవరికీ చెప్పకుండా ఇలాంటి ఏకపక్ష వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఏ పని చేపట్టినా.. సీనియర్లకు బండి సంజయ్ సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రజాసంగ్రామయాత్ర, 317 జీవోకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో తమ ఫొటోలు లేకపోవడం దేనికి సంకేతమని మండిపడుతున్నారు.
►ఇప్పటికే కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్లు నలుగురు పార్టీని వీడేందుకు సిద్ధమైనా స్థానిక ఎంపీ బండి సంజయ్ వారిని పిలిపించి మాట్లాడకపోవడమేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి ఇలాగే పెరుగుతూపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తమను గుర్తించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తెలుగుదేశంతో పొత్తుతో తాము ఉమ్మడి రాష్ట్రంలో 27 శాతం ఓటు బ్యాంకుతో 21 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న విషయాన్ని విస్మరించొద్దని గుర్తుచేస్తున్నారు. మొత్తానికి కరీంనగర్ బీజేపీ సంజయ్, రాజేందర్, సీనియర్లుగా విడిపోయిందని సొంతపార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment