సాక్షి, బెంగళూరు: కోవిడ్-19 కేసులు కొత్తగా పెరుగుతున్న దృష్ట్యా, అటు థర్డ్‌వేవ్ ప్రమాదంపై నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు భారీ ఊరేగింపులు నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, మతపరమైన సమావేశాల్లో భారీగా గుమిగూడటం, ఊరేగింపులను కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఆగస్టు- అక్టోబర్ వరకు పండుగ సీజన్ ప్రారంభంకాన్ను నేపథ‍్యంలో వరమహాలక్ష్మి వ్రతం, ముహర్రం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దుర్గా పూజ తదితర పండుగ రోజుల్లో స్థానికంగా ఆంక్షలను అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఆగష్టు 12 నుండి ఆగస్టు 20 వరకు అన్ని రకాల ఊరేగింపులపై నిషేధం విధిస్తూ కొత్త మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. మొహర్రం, గణేశ్, దసరా ఉత్సవాల వేడుకలపై విస్తృతమైన ఆంక్షలను ప్రకటించింది. రెండు పండుగలకు సంబంధించిన అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది. ఆలం, పంజా, తాజియాత్‌లను దూరం నుండి వీక్షించాలి. ప్రార్థన మందిరాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి. కోవిడ్ సంబంధిత నిబంధనలు పాటిస్తూ మసీదుల వద్ద ప్రార్థనలు జరపాలని పేర్కొంది. అలాగే కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ గ్రౌండ్, షాదీ మహల్ మొదలైన వాటిలో సామూహిక ప్రార్థనలకు అనుమతిలేదు.
గణేష్ చతుర్థికి కూడా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. గణేష్ పందిళ్ల ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. వినాచయక చవితిని సాధారణ పద్ధతిలో జరుపుకోవాలి. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు, నిమజ్జన సంయంలో మాత్రమే ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలి. గణేశ్, దేవీ విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాలలోనే నిమజ్జనం చేయాలి. దేవాలయాలను ప్రతిరోజూ విధిగా శానిటైజ్ చేయాలి. శానిటైజర్ ఉపయోగించిన తర్వాత మాత్రమే భక్తులను అనుమతించాలి. థర్మల్ చెకింగ్ సదుపాయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.
బెంగళూరులో బ్లాక్ ఫంగస్ మాదిరిగా ఎనిమిది మందిలో రెడ్ ఫంగస్ బయటపడింది. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో, కోలుకున్నవారిలో కొందరు బ్లాక్‌ఫంగస్, వైట్, యెల్లో ఫంగస్‌లకు గురికావడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెడ్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఐటీ నగరంలో గత ఐదురోజుల్లో 192 మంది కరోనా రోగుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షలు చేయగా వారిలో 148 మందిలో డెల్టా వైరస్ బయటపడింది. మరో 8 మందిలో రెడ్ ఫంగస్ కనిపించినట్లు బెంగళూరు కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ప్రత్యేక కమిషనర్ రణదీప్ తెలిపారు. అయితే రెడ్ ఫంగస్‌తో అంత ప్రమాదం లేదన్నారు.
డెల్టా రకం వేగంగా సోకుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెంగళూరులో జూలైలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 12 శాతం పిల్లల కేసులు కాగా ఆగస్టు మొదటివారంలో ఇది 13 శాతానికి చేరింది. 12-18 ఏళ్లు మధ్య వయస్సు పిల్లలు ఎక్కువగా బయట తిరుగుతుండటం వల్ల కరోనా సోకుతోందని రణదీప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment