Karnataka BJP MLA Steps Down As KSDL Chairman After Rs 6 Crore Seized At Home - Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా

Published Fri, Mar 3 2023 3:27 PM

Karnataka Bjp Mla Steps Down Ksdl Chairman After Rs6 Crore Seize - Sakshi

బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కీలక పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్‌డీఎల్‌) ఛైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ మైసూర్ శాండిల్‌ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది.

విరూపాక్షప్ప దేవనగెరె జిల్లా చిన్నగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కుమారుడు ప్రశాంత్ మదల్ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డులో చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే తండ్రి తరఫున ఇతడు లంచాలు తీసుకుంటాని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే కేఎస్‌డీఎల్‌ కార్యాలయంలో రూ.40లక్షలు తీసుకుంటున్న ప్రశాంత్‌ను లోకాయుక్త అధికారులు గురువారం రెడ్ ‍ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కార్యాలయంలోనే రూ.1.7కోట్ల నగదును గుర్తించారు. అనంతరం విరూపాక్షప్ప ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి మొత్తం రూ.6కోట్లు సీజ్ చేశారు.

అవినీతి డబ్బుతో కుమారుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే లోకాయుక్తకు పట్టుబడ్డ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన కుటుంబంపై కుట్ర జరగుతోందని ఆయన ఆరోపించారు. 

కాగా.. ప్రశాంత్ అవినీతికి పాల్పడుతూ లంచాలు తీసుకుంటున్నాడని లోకాయుక్తకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో వారు గురువారం చాక్యచక్యంగా అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కాంగ్రెస్ విమర్శలు..
అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు అవినీతికి పాల్పడుతున్నట్ల రుజువుకావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలకు ఎక్కుపెట్టింది. బీజేపీ భ్రష్ట జనతా పార్టీ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. చివరకు మైసూర్ శాండిల్ సబ్బు అందమైన సువాసనను కూడా 40శాతం కమిషన్ సర్కారు కలుషితం చేసిందని మండిపడ్డారు.
చదవండి: కేంద్రంపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు.. పెగాసెస్‌పై కామెంట్స్‌ ఇవే..

Advertisement
Advertisement