కర్ణాటక ఫలితాలు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. దక్షిణాదిపై పట్టు కోసం కాషాయ పార్టీ గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో మరోసారి అధికారం చేజిక్కించుకోవడంతో పాటు తెలంగాణపై పట్టు కోసం ప్రణాళికలు రచించింది. కర్ణాటక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే.. తెలంగాణలో మారుతున్న రాజకీయ వాతావరణం తమకు మరింత కలిసొస్తుందని కేంద్రం భావించింది. అయితే, అనూహ్యంగా కర్ణాటక చేజారడంతో కమలనాథులు ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది.
ఫోకస్ అక్కడే..
బీజేపీ హైకమాండ్ దక్షిణాదిలో తెలంగాణను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే ప్రస్తుత ఫోకస్ తెలంగాణపై పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆపరేషన్ ఆకర్ష్పై నేరుగా రంగంలోకి దిగింది. ఇదిలా ఉండగా హస్తినలో ఈటెల రాజేందర్ తిష్ట వేయగా, అగ్రనాయకులను నేరుగా పొంగులేటితో మాట్లాడించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పార్టీలో కీలకమార్పులు ఉంటాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కర్ణాటక ఫలితాల దెబ్బతో తెలంగాణ బీజేపీలో సమీకరణాలు మారునున్నాయని తెలుస్తోంది.
ఇకపై ఆ తప్పులు చేయకూడదు
కర్ణాటక ఎన్నికల ఓటమి నుంచి బీజేపీ పెద్దలు గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. తమ లోపాల గురించి ఆలోచించడంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయ పార్టీ వ్యూహాన్ని పునరాలోచిస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభ్యర్థులను, ప్రాంతీయ నాయకత్వాన్ని నిర్ణయించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆచితూచి వ్యవహరించాలని అగ్ర నాయకత్వం నిర్ణయించుకుంది.
కర్ణాటకలో బీఎస్ యడియూరప్పను తొలగించడం, లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సదవి వంటి సీనియర్ నాయకులకు టిక్కెట్లు నిరాకరించడం వల్ల అక్కడ భారీగా నష్టపోయిందని పార్టీ గ్రహించింది. అందుకే ఈ సారి అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు కూడా బీజేపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: మహారాష్ట్ర సర్కార్‌కు ముప్పు లేదు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment