PV Narasimha Rao Daughter Vani Devi: KCR Confirms PV Narasimha Rao Daughter As MLC Candidate - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అనూహ్య నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె

Published Sun, Feb 21 2021 7:18 PM | Last Updated on Mon, Feb 22 2021 10:35 AM

KCR confirm pv narasimha rao daughter as MLC Candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ స్థానం అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఆదివారం కేసీఆర్‌ అభ్యర్థిని ప్రకటించారు. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ స్థానానికి ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని ఖరారు చేసిన విషయం తెలిసిందే.


కాగా తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ స్థానం నుంచి రాములు నాయక్‌ (కాం‍గ్రెస్‌), పల్లా రాజేశ్వరరెడ్డి (టీఆర్‌ఎస్‌) ప్రధానంగా పోటీలో ఉండగా.. ఫ్రొపెసర్‌ కోదండరాం, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి (బీజేపీ), విజయసారథి రెడ్డిలు బరిలో ఉన్నారు. మరోవైపు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) రామచంద్రారెడ్డి (బీజేపీ), ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ ప్రధానంగా పోటీలో ఉన్నారు. తాజాగా టీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్నిక రసవత్తరం కానుంది. పట్టభద్రుల కోటా ఎన్నిక కావడంతో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే అన్ని జిల్లాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే పలు విడతల సమావేశాలు నిర్వహించారు.

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు సంక్లిష్టం కావడం వంటి గడ్డు పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుండటం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామమే. ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడంతో పాటు గత ఏడాదిన్నరగా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవనేది నిరుద్యోగుల వాదన. దానికి తోడు కరోనా కాలంలో తనను ఆదుకోలేదని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి అమలు చేయడంలేదని ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాలను గెలుపొందడం గులాబీ పార్టీకి అంతసులువైన విషయం కాదు. బరిలో ప్రధాన పార్టీలతో పాటు ఉద్యమనేతలు కూడా ఉండటం టీఆర్‌ఎస్‌ కొంతమేర ఇబ్బంది ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ మరో రసవత్తరమైన పోటీకి సిద్ధమైంది.

పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకుగాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా.. మార్చి 14న పోలింగ్‌ జరుగనుంది. మార్చి 17వ తేదీన ఓట్ల  లెక్కింపు ఉంటుంది. రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement