భువనగిరిటౌన్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వాటిని పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోకుండా నూతన పార్టీ పెట్టి దేశాన్ని బాగుచేస్తానని బయలు దేరుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గాంధీపార్కు వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించని వాళ్లు, దేశం కోసం పార్టీ పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. వరంగల్ పర్యటనలో భాగంగా వీఆర్‌ఏలు తమ సమస్యలు పరిష్కరించాలేని సీఎం దగ్గరికి వెళ్తే ఎలా ప్రవర్తించారో అందరూ చూశారన్నారు. ఓ వీఆర్‌ఏ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 మంది వీఆర్‌ఏలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీ కోసం రూ.100 కోట్లు పెట్టి సొంతగా ఫ్లైట్ కొనుక్కోవచ్చు కానీ 10 వేల మంది వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించరా అని నిలదీశారు. రెండు రోజుల్లో వీఆర్‌ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనుంచి తప్పించుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, నాయకులు పిట్టల బాలరాజు, మహ్మద్ షరీప్ ఉన్నారు.
చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment