మంగళవారం జరిగిన మేధావుల సమావేశంలో మాట్లాడుతున్న అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.400 కోట్ల మిగులుతో ఉన్న రాష్ట్రం కాస్తా ఇప్పుడు రూ.7.5 లక్షల కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు మెట్రో రైలు, హైవేలు, రోడ్లు, ఇరిగేషన్, యూనివర్సిటీలు తదితరాల కోసం రూ.9 లక్షల కోట్లు కేటాయిస్తే.. ఏడున్నర లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారో, ఆ డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు.
ప్రతి పేదవారికీ బియ్యం, మరుగుదొడ్లు, గ్యాస్ సిలిండర్లు, వందేభారత్ రైళ్లు, ఇలా అన్నింటినీ కేంద్రమే ఇచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోల్లోని అంశాలను హైదరాబాద్‌లో బహిరంగ వేదికలపై వెల్లడించే ధైర్యం ఉందా? అని నిలదీశారు.
‘తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను విస్మరించిన మీకు, పాఠశాల విద్య, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న కొలువులు భర్తీ చేయలేని.. రోజువారీ సమస్యలను పరిష్కరించలేని మీకు, తెలంగాణ ప్రజలను ఓట్లడిగే హక్కు, అధికారం లేదు..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం సిఖ్ విలేజీ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివిధ రంగాల వృత్తి నిపుణులు, మేధావులు, సైన్యంలో దేశానికి సేవ చేసినవారు, ఇతర వర్గాలతో నిర్వహించిన సమావేశంలో అమిత్‌షా ప్రసంగించారు.
తెలంగాణ అభివృద్ధే బీజేపీ ధ్యేయం: కిషన్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధి, వికాసమే బీజేపీ ప్రధాన ధ్యేయమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి నిరోధక సర్కార్ ఉందని, ఫాంహౌస్, కుటుంబ రాజకీయాలతో తెలంగాణను ఏలుతోందని ఆరోపించారు. బీజేపీని ఆశీర్వదిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ...మేధావులు మౌనం వీడాలని, బీఆర్‌ఎస్ నియంతృత్వ, అవినీతి పాలనను అంతమొందించేలా ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పార్టీ నేతలు ప్రకాశ్ జవదేకర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, ఏవీఎన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీ డీజీపీలు కృష్ణప్రసాద్, జయచంద్ర, అరవిందరావు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఓయూ వీసీ తిరుపతిరావు, విశ్రాంత ఐఏఎస్‌లు రామచంద్రుడు, చంద్రవదన్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీని గెలిపిస్తే ఉత్తమ రాష్ట్రంగా మారుస్తాం
‘కేసీఆర్ పార్టికి ఒక సిద్ధాంతం, విధానం అంటూ ఏమీ లేదు. తన కుమార్తె కవితను జైల్లో వేయొద్దని, కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలని కోరుకోవడం, కుటుంబ ప్రయోజనాల కోసం అవినీతికి పాల్పడడం తప్ప ఇంకేమీ లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలలో దేనికి ఓటేసినా వాటిల్లో మరో పార్టికి వేసినట్టే. అందువల్ల తెలంగాణలో బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తే అన్నిరంగాల్లో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా మారుస్తాం.
గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పటి అనుభవాలు, కుటుంబ, నియంతృత్వ పాలన, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు పాల్పడిన తీరు దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వృత్తి నిపుణులు, మేధావులు వేసేది కేవలం ఒకే ఓటు కాదు. వారంతా తమ తమ రంగాలు, పరిధుల్లో అనేకమంది ప్రజలకు సరైన మార్గదర్శనం చేయగలరు.
కాబట్టి గత తొమ్మిదేళ్లలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీని గెలిపించే దిశలో మీ వంతు కృషి చేయాలి..’ అని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ‘మొత్తం కుటుంబ, వారసత్వ పార్టీల అవినీతితో కూడిన ఇండియా కూటమి ఏవో కలలు కంటోంది. అయినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీతో ముచ్చటగా మూడోసారి కూడా మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది..’అని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment